Actor Nani Ninnu Kori Vs Spyder Vs Duvvada jagganadhamగత రెండేళ్ళ కాలంలో వరుస హిట్లు చవిచూస్తున్న హీరో ఎవరంటే… ‘నాచురల్ స్టార్’ నాని అన్న పేరే వస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో ‘నేను లోకల్’ ద్వారా సూపర్ సక్సెస్ కొట్టిన నాని, సమ్మర్ లో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. “నిన్ను కోరి” టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 23వ తేదీన విడుదల చేయాలని నిర్మాత డివివి దానయ్య ప్లాన్ చేస్తున్నట్లుగా అధికారిక సమాచారం వెలువడింది. అయితే ఇదే తేదీకి ఏ సినిమా విడుదల అవుతుందో అందరికీ తెలిసిందే.

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “స్పైడర్” సినిమా జూన్ 23వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు పోటీగా బన్నీ “దువ్వాడ జగన్నాధమ్”ను కూడా రంగంలోకి దించుతున్నారని ఇటీవల ఓ టాక్ సందడి చేసింది. ముందుగా జూన్ 23 అన్నప్పటికీ, తాజాగా జూలై 7వ తేదీకి ఈ సినిమా డేట్ ను మార్చినట్లుగా తెలుస్తోంది. బన్నీ వెనక్కి తగ్గాడు గానీ, మహేష్ సినిమా విడుదల తేదీకి నాని ఎంట్రీ ఇచ్చి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.

ఇందులో మరో విశేషం ఏమిటంటే… కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న “భరత్ అనే నేను” సినిమాను దానయ్య నిర్మించనున్నాడు. మరి ప్రిన్స్ తో సినిమా తీస్తూ… ప్రిన్స్ సినిమాకే పోటీగా తన తాజా చిత్రాన్ని విడుదల చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మహేష్ రేంజ్ నానికి లేకపోయినప్పటికీ, ప్రస్తుతం నాని సినిమా అంటే పడిచచ్చే సినీ ప్రేక్షకులకు, నాని అభిమానులకు కొదవలేదని చెప్పవచ్చు. మరోవైపు “స్పైడర్” వంటి ప్రతిష్టాత్మక సినిమాతో తలపడడం నానికి కూడా కాస్త డేంజరే అని చెప్పకతప్పదు.