Muniyappa, Muniyappa  Kidnaps Teenager, Actor Muniyappa  Kidnaps Teenager, Challenger Muniyappa  Kidnaps Teenager,  Muniyappa Kidnaps Vinayak Bapat Sonవెండితెరపై హీరో వేషాలు వేస్తున్న వ్యక్తి, నిజ జీవితంలో విలన్ పనులు చేస్తూ పట్టుబడ్డాడు. తను హీరోగా తీస్తున్న సినిమాకు మరిన్ని డబ్బులు అవసరం కావడంతో దిక్కుతోచని ‘హీరో’ ఓ కిడ్నాప్‌కు తెరతీశాడు. అయితే పన్నాగం ఫలించకపోవడంతో పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. మరో ట్విస్ట్ ఏమిటంటే… ఇప్పటికే సదరు వ్యక్తిపై బోలెడు కేసులు ఉండడాన్ని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ కధాకమామీషు ఏమిటంటే…

బెంగళూరులోని సింగపుర లే అవుట్‌కు చెందిన 28 ఏళ్ళ మునియప్ప ‘ఛాలెంజర్’ అనే కన్నడ సినిమాలో ఈశ్వర్ పేరుతో హీరోగా నటిస్తున్నాడు. మునియప్పతో పాటు అతడి స్నేహితుడైన హసన్ కూడా ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టాడు. అయితే మరిన్ని డబ్బులు కావాల్సి ఉండడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కిడ్నాపుల ద్వారా డబ్బులు సంపాదించాలని భావించారు. మరికొందరితో కలిసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన వీరు ఈ నెల 24వ తేదీన కిర్లోస్కర్ ఎలక్ట్రికల్ కంపెనీ ఎండీ వినాయక్ బాపట్ కుమారుడు, ఇంజినీరింగ్ చదువుతున్న 19 సంవత్సరాల ఇషాన్ ను కిడ్నాప్ చేశారు.

తీరా విషయం పోలీసులకు తెలియడంతో భయపడి ఇషాన్‌ ను వదిలిపెట్టారు. అయితే ఈ కేసును శోధించిన పోలీసులు మునియప్పతో పాటు హసన్ దొంగరి, జగదీశ్, జగన్నాథ, మనోజ్ తదితరులను కూడా అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా మునియప్పపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తేలింది. మాజీ ఎమ్మెల్యే కుమార్తెను పెళ్లి చేసుకున్న మునియప్పపై అపహరణ కేసు నమోదు కావడం, ఆ తర్వాత రాజీకి రావడంతో దానిని కొట్టివేశారు. మాజీ ఎమ్మెల్యే కూతురితో విడాకుల అనంతరం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

ఆ తర్వాత చైన్ స్నాచింగ్ గ్యాంగ్ లో చేరిన మునియప్పపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఓ దోపిడీ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. టీవీ ప్రోగ్రాములకు పనిచేస్తూ నేరాలకు పాల్పడేవాడు. అంతేకాదు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తెరిచి పలువురిని మోసం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అతడి మోసాలకు అంతే లేదని పోలీసులు పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే… అతడి ‘ఛాలెంజర్’ చిత్రానికి ‘విజయం కోసం పోరాటం’ అని ట్యాగ్ ‌లైన్ ఉండడం. అదే మరి… రీల్ లైఫ్ టైటిల్ కు, అతను అనుభవిస్తున్న రియల్ లైఫ్ కు ఏ మాత్రం పొంతన లేదు.