Minister Rojaఏపీలో కొందరు మంత్రులకి పవన్‌ కళ్యాణ్‌ని తిట్టడమే ప్రధాన బాధ్యత కనుక వారి శాఖలు రద్దు చేసి ‘పవన్‌ కళ్యాణ్‌ని తిట్టే శాఖ’ అని ఓ ప్రత్యేకమైన శాఖని ఏర్పాటుచేసి వారికి అప్పగిస్తే బాగుంటుందని బుల్లితెర నటుడు హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు మంత్రి రోజాకి బాగానే తగిలిన్నట్లున్నాయి.

ఆమె మీడియాతో మాట్లాడుతూ, “సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలే ఓ ఆరేడుగురున్నారు. కనుక వారు తమని ఎక్కడ అణగ త్రొక్కేసి తమ కెరీర్‌ని నాశనం చేస్తారనే భయంతో హైపర్ ఆదీ వంటి చిన్న నటులు వారి భజన చేస్తుంటారు. వారి భయం నేను అర్దం చేసుకోగలను. వారందరూ మెగా ఫ్యామిలీ పట్ల భయంతోనే అణిగిమణిగి ఉంటున్నారు తప్ప ప్రేమతో కాదు. కనుక అటువంటి చిన్న నటుల విమర్శలను నేను పట్టించుకోను. కనుక వారంతట వారు అటువంటి విమర్శలు చేయరు. కానీ వారిని వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నవారినే నేను తప్పు పడతాను. మంత్రులకి తమ శాఖల గురించి తెలియదని విమర్శించారు. ఏ మంత్రికైనా తన శాఖ గురించి తెలుసుకోకుండా ఉంటారా?” అంటూ మెగాఫ్యామిలీని ఆక్షేపించారు.

ఆమె వ్యాఖ్యలపై నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ, “నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ క్యాంపెయిన్ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని గానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత బయపడతారెందుకు..” అంటూ సున్నితంగానే మంత్రి రోజాకి చురక వేశారు.

ఏనాటికైనా మంత్రి పదవి చేపట్టాలని తహతహలాడిన రోజా, ఆ కల నెరవేరినప్పుడు మంత్రిగా తన సమర్దత నిరూపించి చూపుకొని ఉంటే అందరూ హర్షించేవారు. కానీ ఆమె తన పర్యాటక మంత్రిత్వశాఖ గురించి ఏనాడూ మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి గల అవకాశాలని ఆమె గుర్తించిన్నట్లు కనబడరు.

ఆమె మీడియా ముందుకు వస్తే 1. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని ఎద్దేవా చేయడం, 2. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి భజన చేయడం రెండే చేస్తుంటారని టిడిపి, జనసేన నేతలు ఆక్షేపిస్తుంటారు. కాదని మంత్రి రోజా నిరూపించగలరా? అనే టిడిపి, జనసేన నేతల సవాలుకి మంత్రి రోజా జవాబు చెప్పగలారా?