achem-naiduవైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి తెలుగు దేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. ఇటీవలే జాయిన్ అయిన గిడ్డి ఈశ్వరితో కలిపి ఫిరాయింపుల సంఖ్య 22కు చేరింది. అదే విధంగా ముగ్గురు ఎంపీలు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరో వైపు మంత్రి అచ్చెన్నాయుడు వైకాపా శిబిరంపై మరో బాంబు విసిరారు.

“వైకాపాకు చెందిన ఒక పెద్ద తలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం. అనేకరకాలుగా చర్చలు జరుపుతున్నాం. ‘అన్నిరకాలు’గా వారికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అది వర్కవుట్‌ అయితే దాదాపు మా లక్ష్యం వందశాతం పూర్తయినట్లే. ఇక అక్కడ మిగిలేది ఒకరో ఇద్దరో మాత్రమే,” అని ఆయన చెప్పుకొచ్చారు.

దీనితో వైకాపా పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే కొనసాగుతున్న వలసలతో ఆ పార్టీ శ్రేణులలో నిస్తేజం ఆవహించింది. ఒకవైపు జగన్ మహా పాదయాత్ర చేస్తున్న మరోవైపు నేతలు తరలిపోవడంతో ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితి. అసలు ఆ పెద్ద తలకాయ ఎవరు అనే చర్చ కూడా సాగుతుంది.

నెల్లూరుకు చెందిన ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇద్దరిలో ఒకరని అందరు అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి తరలిపోతే చిత్తూర్ జిల్లాలో వైకాపా ఖాళీ అవ్వడం ఖాయం. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా తరలిపోతారు. దీనితో సర్వత్రా టెన్షన్ అలముకుంది.