Acharya Movie Reviewమెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ అయిపోయింది. ఆచార్యుల మార్కుల రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఊహించినట్లు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి నటించారు. వారిద్దరినీ చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇద్దరు ఫైట్స్, డ్యాన్సులు ఇరగదీశారు. ధర్మస్థలి, పాదఘట్టం సెటింగ్స్ అదిరిపోయాయి. మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది. కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అంటే సూపర్ డూపర్ హిట్టే అనుకొంటే తొందరపాటే అవుతుంది.

అభిమానంతో ఆచార్య సూపర్ హిట్ అయ్యిందని మెగా అభిమానులు అనుకోవచ్చు కానీ సినిమాలో హీరోల ఎలివేషన్ కోసం విలన్లతో ఫైట్స్ తప్ప కొత్తగా ఏమున్నాయి?అంటే ఏమీ కనబడవు. కనీసం కొరటాల కలం నుంచి పదునైన డైలాగ్స్ అయినా జొప్పించి ఉంటే బాగుండేది. కానీ అవీ పెద్దగా కనబడవు.

అసలు ఈ సినిమాలో నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌, కొరటాలని, సెటింగ్స్, మ్యూజిక్, కెమెరాలను తీసి పక్కన పెట్టి చూస్తే గతంలో ఇటువంటి వందల సినిమాలు వచ్చాయని అర్ధం అవుతుంది. అంటే పాత సార కొత్త సీసాలో పోసినట్లు అన్నమాట!

గతంలో చక్కటి సినిమాలు అందించిన దర్శకుడిగా మారిన రచయిత కొరటాల శివ ఇద్దరు అగ్రనటులను పెట్టుకొని మంచి కధ, కధనం అందించలేక ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకొన్నారని చెప్పక తప్పదు. అలాగే ఎంతో అనుభవం ఉన్న చిరంజీవి, రామ్ చరణ్‌, శివ తమ ముగ్గురి కాంబినేషన్‌లో తీస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో చాలా భారీ అంచనాలు ఉంటాయని తెలిసీ కూడా ఇటువంటి పాత చింతకాయ పచ్చడి రుబ్బాలనుకోవడం పొరపాటని ఈ సినిమా నిరూపిస్తుంది. వారు ముగ్గురు సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలువ వలసిన ఆచార్య ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది.