raghu rama krishna rajuఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి ‘వెల్కమ్ ఆచార్య’ అని సంబోధించడం ఎంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దీని వెనుక ఉన్న అసలు కధ ఏమిటో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

ప్రతి కేసులో జగన్ మోహన్ రెడ్డికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉండే నిరంజన్ రెడ్డే “ఆచార్య” సినిమాకు ఓ నిర్మాత అని ఆర్ఆర్ఆర్ ఇచ్చిన ట్విస్ట్ సోషల్ మీడియాను బ్లాస్ట్ చేసింది. అందువలనే ‘ఆచార్య’ సంగతి వైఎస్ జగన్ కు తెలిసి ఉంటుందని, చిరంజీవిని ముఖ్యమంత్రితో సమావేశపరచడానికి కారణం కూడా అదేనని అభిప్రాయపడ్డారు.

ఈ విధంగా అయినా సినిమా ఇండస్ట్రీపై జరుగుతున్న దాడి ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లుగా ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ అభిలాషించారు. ఇప్పటివరకు బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఓ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చెప్పడంతో, అభిమానులంతా అవాక్కయ్యారు. బహుశా నిరంజన్ ద్వారానే ‘వైసీపీ అండ్ కో’ హీరోల పారితోషికాలు తదితర సమాచారం కూడా సేకరించి ఉంటారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి జగన్ ‘వెల్కమ్ ఆచార్య’ ట్విస్ట్ మాత్రం మాములుగా లేదు. ఇలాంటి ట్విస్ట్ లు బహుశా ‘ఆచార్య’లో కూడా ఉంటే ఫ్యాన్స్ మరింత పండగ చేసుకుంటారు. జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే, బయట ప్రపంచానికి కనపడేది ఒకటి, అసలు అక్కడ జరుగుతోంది మరొకటి అన్న అనుమానాలు సామాన్యులకు రాకుండా ఉండవు.