Acharya AP Governmentకొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు నటించిన ఆచార్య ఈ నెల 29న విడుదలకాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం దీనికి మొదటి పదిరోజులు టికెట్ ఛార్జీలు పెంచుకొని, నాలుగు షోలకు అదనంగా మరో షో వేసుకొనేందుకు సోమవారమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్ళ ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ఛార్జీలు రూ.50 చొప్పున పెంచుకొనేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అదనపు షో గురించి దానిలో ప్రస్తావించలేదు.

గతంలోలాగా ఇప్పుడు ఎంత పెద్ద, గొప్ప సినిమాలైన 100 రోజులు ఆడే పరిస్థితి లేదు కనుక మొదటి పది రోజులే ఏ సినిమాకైనా చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ సినిమాలకు ఈ అదనపు షోలు చాలా కీలకమైనవి. ఇదీగాక సినిమాకు ముందూ వెనుక రిలీజ్ అయ్యే ఇతర పెద్ద సినిమాల ఒత్తిడిని తట్టుకొంటూ, సినిమాపై పెట్టిన పెట్టుబడిని వెనక్కు పొందేందుకు ఈ అదనపు షోలు ఎంతో అవసరం. ఒకసారి సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా, మరో పెద్ద సినిమా రిలీజ్ అయిన కలెక్షన్లు పడిపోతాయి. అందుకే ఈ మొదటి పది రోజులలోనే అదనపు టికెట్ చార్జీలతో, ఒక అదనపు షోతో పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవాలని నిర్మాతలు తాపత్రయపడుతుంటారు.

ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం బాగానే అర్దం చేసుకొంది కనుకనే పెద్ద సినిమాల నిర్మాతలు, హీరోలు, దర్శకులను తమ చుట్టూ తిప్పించుకోకుండా, వారు అడగకుండానే టికెట్ ఛార్జీలు పెంచుకొని, అదనపు షోలు వేసుకొనేందుకు ముందుగానే ఉత్తర్వులు జారీ చేస్తోంది. కానీ తెలుగు సినీ పరిశ్రమకు పుట్టినిల్లు వంటి ఆంద్రాలోనే ప్రతీ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతుండటం చాలా బాధాకరం. సినీ పరిశ్రమకు ఆంద్రాకు తరలిరావాలని కోరుకొంటున్నప్పుడు, దాని పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలి కదా?కోట్లు పెట్టిన తీసిన సినిమాలను ఏపీలో ప్రదర్శించుకోవడానికే ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరు మాత్రం ధైర్యం చేసి ఏపీకి రాగలరు?