Acham-Naidu-Buggana-Rajendranath-Reddy-Assembly-Kadapa-Steel-Plantబహిరంగసభలలో ఎలాగూ వైసీపీ సొంత డబ్బా వాయించుకొంటూనే ఉంటుంది. శాసనసభ సమావేశాలలో కూడా ‘ఒక రాజు-మూడు రాజధానులు’ పిట్ట కధ చెప్పుకోవాలనుకొని డప్పు వాయించుకోవాలనుకొన్నారు. కానీ టిడిపి సభ్యులు గట్టిగా నిలదీస్తుండటంతో వీలుపడటం లేదు. కనుక వారు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని సభ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు. కనుక ఇప్పుడు వైసీపీ సభ్యులు ప్రశాంతంగా ఆ కధ చెప్పుకొని దాని వలన రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రజలకు చెప్పబోతున్నారు.

‘అధికార వికేంద్రీకరణ అంటే అదేదో ఎవరికీ అర్దం కాని బ్రహ్మపదార్ధం కాదని ఇంటివద్దకే రేషన్ సరుకులు అందించడమే’ అని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు అందరికీ అర్దమయ్యేలా చెపుతున్న తమ అధినేత తెలివితేటలకు వైసీపీ సభ్యులు అబ్బురపడిపోతూ వాహ్వా … వాహ్వా… అంటూ చేతులు నొప్పెట్టే వరకు లేదా బల్లలు విరిగిపోయేవరకు చరుచుకోవచ్చు. పోటీలు పడి తమ అధినేత భజన చేసుకోవచ్చు.

నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో టిడిపి సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెపుతామని అందుకోసం శాసనసభ సమావేశాలు మరో పది రోజులు పొడిగించడానికి కూడా మేము సిద్దమే అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ తొలిరోజున సమాధానాలు చెప్పలేక సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇవాళ్ళ రెండో రోజున కూడా టిడిపి సభ్యులను సస్పెండ్ చేసి సభలో ప్రతిపక్షాల గొంతు వినబడకుండా చేశారు.

ఈరోజు శాసనసభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కడపలో స్టీల్ ప్లాంట్ గురించి నిలదీసినప్పుడు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దానికి సమాధానం చెప్పలేక తడబడ్డారు. విభజన చట్టంలో దానిపై స్పష్టత లేదని ఒకసారి, కరోనా కారణంగా ఆలస్యమైందని మరోసారి సమాధానం చెప్పడం చూస్తే ఇటువంటి అంశాలపై ప్రతిపక్ష సభ్యులకు ఉన్నంత అవగాహన కూడా మంత్రులకు లేదని స్పష్టమవుతోంది.

టిడిపి సభ్యులు ఈవిదంగా ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే వాటికి జవాబు చెప్పుకోవడం చాలా కష్టమే కాకుండా తమ పిట్ట కధ, భజనకి కూడా అవరోదం కలుగుతుంది. కనుకనే తమపై సస్పెన్షన్ వేటు వేసి బయటకి పంపించారని టిడిపి సభ్యులు ఆరోపిస్తున్నారు.