jerusalem-muttaiah-acb‘ఓటుకు నోటు’ అని తెలంగాణా సర్కార్ వెలుగుతీసిన కొద్ది రోజులకే ఏపీ ‘ఫోన్ ట్యాంపరింగ్’తో బదులిచ్చింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెను విధ్వంసాన్ని సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే శుక్రవారం రాత్రి సమయంలో టీ-ఏసీబీ అధికారులు ఏ-4గా ఉన్న జెరూసలెం మత్తయ్యకు వారంలోగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఉప్పల్ లోని మత్తయ్య ఇంటికెళ్లిన ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల్లో ప్రస్తావించిన కీలక అంశమేమిటంటే… హైకోర్టు ఉత్తర్వుల మేరకు అరెస్ట్ చేయబోమని, అంతేకాక న్యాయవాదితో కలిసి విచారణకు రావచ్చని కూడా మత్తయ్యకు హామీ ఇచ్చింది.

అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందని టిడిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో, మరో ఇద్దరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని, ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (టీడీపీ)ను కూడా తమ పార్టీలోకి లాక్కునే క్రమంలో టీఆర్ఎస్ సర్కారు ‘ఓటుకు నోటు’ కేసును మళ్లీ తెరపైకి తెచ్చిందన్న కధనాలు పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి అందజేసిన నగదును గోపీనాథే సమకూర్చారని, ఈ క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మత్తయ్యకు నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘ఓటుకు నోటు’ కేసు మళ్ళీ తెరపైకి రావడంతో మరోవైపు ఏపీ సర్కార్ కూడా ‘ఫోన్ ట్యాంపరింగ్’ను మళ్ళీ వెలికి తీస్తుందా? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో ఏర్పడిన ‘శాంతి’ వాతావరణం మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుందో అన్న కోణంలోనూ కధనాలు వెలువడుతున్నాయి.