AP PCC President Raghuveera Reddyనంద్యాల ఉప ఎన్నికలు అనేవి… రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ప్రతీకగా తెలుగుదేశం మరియు వైసీపీలు భావిస్తున్నాయి. అందుకనే ఎంతైనా తిట్టి నంద్యాలలో గెలవాలని వైసీపీ చూస్తుంటే… తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పేరు చెప్పి విజయం పొందాలని అధికార టిడిపి చూస్తోంది. ఈ రెండు పార్టీలు ఇలా హోరా హోరీగా తలపడుతుండగా… ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే వీరిద్దరే కాదు… ‘ఆటలో అరటిపండు’ మాదిరి ‘నేనున్నాను’ అంటూ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ప్రకటించింది.

మైనార్టీ ఓటు బ్యాంకింగ్ కీలకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలలో, వాటిని క్యాష్ చేసుకుని కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా… అబ్దుల్ ఖాదర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 5వ తేదీన జరగనున్న నామినేషన్ కార్యక్రమానికి మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికల తీర్పు వస్తుందని రఘువీరా వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

తల్లి కాంగ్రెస్ – పిల్ల కాంగ్రెస్ లు గా ఖ్యాతి గడించిన ‘కాంగ్రెస్ – వైసీపీ’ల మధ్య జరిగిన రహస్య ఒప్పందంలో భాగంగా… ఓట్లను చీల్చి, తద్వారా జగన్ కు ప్రయోజనం చేకూరేలా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని రంగంలోకి దించిందనేది అసలు టాక్. ఈ ఎన్నికలలో గెలుపు కాదు కదా… కనీసం డిపాజిట్ దక్కించుకున్నా కాంగ్రెస్ అతి పెద్ద విజయం సాధించినట్లేనని అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసి కూడా మైనార్టీ అభ్యర్ధిని రంగంలోకి దించిందంటే… తల్లి కాంగ్రెస్ పోకడ బయట పడింది అంటున్నాయి పొలిటికల్ వర్గాలు.