AB Venkateswara Rao-IPSటీడీపీ హయాంలో అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అనే అభిప్రాయం పలువురిలో ఉంది. చంద్రబాబు హయాంలో పనిచేసిన డీజీపీని ప్రభుత్వం అప్రాధాన్య పోస్టింగులో పెట్టింది. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు సీఈఓగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ విషయంలో కూడా అదే జరిగింది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న వేధింపులను తట్టుకోలేక తాను మాతృ సంస్థకు వెళ్ళిపోతానని రిలీజ్ చేయాలని కోరగా….జాస్తి కృష్ణ కిషోర్ అవినీతికి పాల్పడ్డారని రాత్రికి రాత్రి జగన్ సర్కార్ ఎంక్వయిరీ వేయడం జరిగింది. క్యాట్ ట్రిబ్యునల్ కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తాజాగా అప్పటి ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

అఖిల భారత సర్వీసు నిబంధనల్ని అతిక్రమించి అవినీతికి పాల్పడినందుకు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. మాములుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. కానీ జగన్ ప్రభుత్వంలోకి వచ్చాకా వెంకటేశ్వరరావును నిన్నటివరకు కూడా పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగానే ఈయన టీడీపీకి అనుకూలం అని ఆరోపణలు చేసేవారు.

ఎనిమిది నెలలు ఉద్దేశపూర్వకంగానే పోస్టింగు ఇవ్వకుండా, ఇప్పుడు కావాలని సస్పెన్షన్ విధించారని ఆయన ఆరోపణ. ఈ వ్యవహారమంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే అప్పటి ఉద్యోగులను వేధిస్తున్నారా అనే అనుమానాలు రాకమానవు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.