9.1-km-Longest-dhola-sadiya-bridge-in-Indiaనేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి ప్రారంభమైంది. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. అస్సాంలోని సాదియా, అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ధోలా‌లను ఈ సేతువు కలుపుతుంది. ఈ బ్రిడ్జి సాదియా-ధోలా ప్రాంతాల మధ్య ఉన్న 6 గంటల ప్రయాణ దూరాన్ని కేవలం గంటకు తగ్గించనుంది.

అలాగే 60 టన్నుల యుద్ధ ట్యాంకును కూడా ఈ బ్రిడ్జ్ పై నుండి తరలించేంత దృఢంగా నిర్మించారు. చైనా సరిహద్దుకు సమీపంలో ఉండడంతో యుద్ధ సమయంలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సైన్యానికి వేగంగా చేరవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే, అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం ప్రజలు ఎయిర్‌పోర్టు, రైలు మార్గాలను వేగంగా చేరుకునే వెసులుబాటును ఈ బ్రిడ్జి కల్పిస్తోంది. 2011లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు దాదాపుగా 2050 కోట్లు వెచ్చించారు.

అస్సాం రాజధాని దిస్పూర్‌కు 540 కిలోమీటర్లు, అరుణాచల్‌ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపే ఉంది. దీంతో డ్రాగన్ కంట్రీ చైనా ఇటువైపు ఓ కన్నేసి ఉంచింది. ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంతో ఇప్పటివరకు దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ముంబైలోని 3.55 కిలోమీటర్ల బాంద్రా-వోర్లి సీ లింక్ బ్రిడ్జి రెండవ స్థానానికి చేరుకుంది. అయితే ఇంతటి భారీ ప్రాజెక్ట్ ను నిర్మించిన సంస్థ మన తెలుగు నేలకు చెందిన ‘నవయుగ’ నిర్మాణ సంస్థ కావడం తెలుగు వారందరికీ గర్వకారణం.