82-yr-old-woman-returns-to-her-village-after-40-yearsసినిమా సీన్ల‌ను తలపించేలా ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌ లో ఓ అద్భుత సంఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. న‌మ్మ‌శ‌క్యం కాని ఈ విష‌యాన్ని తెలుసుకొని అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. చ‌నిపోయిందని అంద‌రూ భావించిన విలాస అనే ఒక మహిళ 40 సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ త‌న సొంత గ్రామంలో అడుగుపెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ప్రస్తుతం ఆమెకు 82 సంవత్సరాలు.

40 ఏళ్ల క్రితం అంటే (1976లో) పశుగ్రాసం కోసం త‌న గ్రామానికి స‌మీపంలో ఉన్న అడవికి విలాస వెళ్లింది. అడ‌విలో ఆమెను పాము కాటు వేయ‌డంతో నాటు వైద్యం చేయించారు. నాటు వైద్యం ప‌నిచేయ‌క‌పోవ‌డంతో కోలుకోలేదు. దీంతో ఆమె మ‌ర‌ణించింద‌ని భావించిన బంధువులు, స్థానికులు గంగా నదిలో పడేశారు. అక్క‌డే అంతిమ సంస్కారాలు నిర్వ‌హించి వెళ్లారు. అయితే ఇక్కడే అసలు ‘ట్విస్ట్’ నెలకొంది.

నదిలో కొట్టుకుపోతున్న విలాసను జాల‌ర్లు కాపాడారు. స్పృహలో లేని ఆమెకు వైద్యం అందించారు. అయితే ఆమె స్పృహ ‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌ గతం మర్చిపోవడంతో, వారి దగ్గరే ఉండిపోయింది. ఇటీవ‌లే ఆమెకు త‌న గ‌తం పూర్తిగా గుర్తుకొచ్చి, త‌న‌వాళ్ల గురించి ఓ బాలిక‌కు చెప్పింది. ఈ విషయాన్ని ఆ బాలిక తన బంధువుకు చెప్పడంతో, ప‌లువురు ఆమె వ‌ద్దకు వ‌చ్చి వివ‌రాలు తెలుసుకొని సొంత గ్రామానికి పంపించారు.

ఇప్పుడు ఆమె త‌న‌ కుమార్తెలను క‌లుసుకుంది. విలాస‌కు 82 ఏళ్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమెకు ఉన్న‌ పుట్టుమచ్చల ఆధారంగా కుమార్తెలు త‌మ త‌ల్లిని గుర్తించారు. ఇన్నేళ్ల త‌రువాత త‌మ త‌ల్లిని తిరిగి క‌లుసుకోవ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఏదొక సినిమా గుర్తుకు రావడం సహజం. ఒక్క సినిమా ఏముందిలేండి… మన తెలుగులోనే బోలెడు సినిమాలు ఉన్నాయి కదా! అయితే ఇలాంటి కధలు సినిమాల్లో చూసి నవ్వుకునే మనం, నిజంగా ఇలా జరుగుతుందని తెలిసి అవాక్కవ్వకుండా ఉండలేం కదా!