500-1000-notes-deposit RBI rulesపెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఒక్కసారిగా బ్యాంకులలోకి ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటివరకు 4 లక్షల కోట్లు పైనే బ్యాంకు ఖాతాలలో జమ కావడంతో, నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు బ్లాక్ మనీ రాయుళ్ళు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారన్న అంచనాలు వేసిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది.

ఇతురుల ఖాతాల్లో తమ డబ్బులు జమవేసి ‘నలుపు’ను ‘తెలుపు’ చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన నల్లకుభేరులకు చెక్ పెట్టేందుకు థర్డ్ పార్టీ డిపాజిట్లపై ఆథరైజేషన్ లెటర్ ఉంటేనే అనుమతిస్తామని తెలిపింది. దేశంలోని అన్ని బ్యాంకులు ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అంటే… వేరొకరి ఎకౌంటులో మరొకరు డబ్బు జమ చేయాలంటే, ఖాతాదారుడి నుండి ఖచ్చితంగా ఒక లెటర్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది.

ఈ ఆథరైజేషన్ లెటర్ లేని పక్షంలో థర్డ్ పార్టీ డిపాజిట్లను స్వీకరించేది లేదని ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది, అందుకు అనుగుణంగా శనివారం నుండే అమలు చేసింది. దీని వలన కేవలం ఖాతాదారుడు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ డిపాజిటింగ్ మెషీన్లను సైతం ఇందుకు అనుగుణంగా మార్చేసారు. ఇది నల్లధనం డిపాజిట్లకు అడ్డుకట్ట వేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.