37 years legacy of TDPతెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 36 వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 37వ పడిలోకి ప్రవేశించింది. అన్నగారు ఏ ముహూర్తంలో ఆ పార్టీని మొదలు పెట్టారోగానీ ఆ పార్టీ ప్రయాణమంతా అనితరసాధ్యమైన విజయాలు అనూహ్యమైన సంక్షోభాలే. ఐనా సరే విజయవంతంగా 36 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

పార్టీ పెట్టిన తొమ్మిది ఏళ్లలోనే అధికారంలోకి వచ్చినా ఎన్టీ రామారావు లాంటి అద్భుతమైన ఛరిష్మా కలిగిన నాయకుడిని పక్కన పెట్టి మనగల్గినా అది ఒక టీడీపీకే చెల్లింది. అయితే 37వ పడిలో టీడీపీకి మరో సవాలు ఎదురవుతుంది. తెలంగాణాలో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఎన్డీయే నుండి బయటకు రావడంతో దేశంలోనే అతిశక్తిమంతమైన నరేంద్ర మోడీని ఢీకొట్టాల్సిన పరిస్థితి. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో మళ్ళీ కేంద్రంపై పోరాడాల్సిన పరిస్థితి. ఆ పోరాటం వచ్చే ఎన్నికలకు టీడీపీకి కీలకం అదే విధంగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి కూడా.

2019లో జరిగే ఎన్నికలు టీడీపీకి పద్మవ్యూహం పన్నుతున్నట్టుగా ఆ పార్టీ వారి అనుమానం. వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేనను ఒక పథకం ప్రకారం బీజేపీ నాయకత్వం టీడీపీపైకి ప్రయోగిస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. 2019లో గెలవకపోతే అటు జగన్ ఇటు మోడీ పార్టీని కబళించే ప్రయత్నం చేస్తారని చంద్రబాబుకు తెలుసు. ఈ సంక్షోభాన్ని టీడీపీ ఎలా ఎదురుకుంటాదో చూడాలి మరి.