Nani Dasara సినిమాల ప్రమాణాలు నిర్దేశించడంలో సెన్సార్ బోర్డు తన బాధ్యతకు వందకు వంద శాతం న్యాయం చేస్తుందని చెప్పలేం కానీ ఇప్పటికీ ఈ విధానం పట్ల మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దసరాకు ఎన్నడూ లేనిది 36 కట్లు పడటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అధికారులు అభ్యంతరం చెప్పిన పదాలు సన్నివేశాలు గతంలో కొన్ని బ్లాక్ బస్టర్లలో వచ్చినవే. కాకపోతే దసరాలో మోతాదు ఎక్కువ ఉండటంతో పాటు నిర్మాతలు యు/ఏ సర్టిఫికెట్ కోరిన కారణంగా దానికి అనుగుణంగా అబ్జెక్షన్లు చెప్పినట్టుగా అర్థమవుతోంది.

ఈ కత్తెర్లు కోతలు ఇండియన్ సినిమాకు కొత్తేమీ కాదు. మన దేశంలో ఇప్పటిదాకా అత్యధిక కటింగ్స్ కి గురైన బాలీవుడ్ మూవీ గ్రాండ్ మస్తీ. దీనికి ఏకంగా 218 కట్లు చెప్పారు. టైటిల్ కు తగ్గట్టే అంత దారుణమైన సన్నివేశాలు, బూతులు ఉంటాయి. తర్వాతి స్థానాల్లో మస్తీజాదే (381), క్యా కూల్ హై హం (150), ఉడ్తా పంజాబ్(94), హైదర్ (41)లు ఉన్నాయి. ఇవన్నీ కమర్షియల్ గా పెద్ద స్థాయిలో వర్కౌట్ చేసుకుని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించినవే. కంటెంట్ పరంగా హైదర్, ఉడ్తా పంజాబ్ లు మాత్రమే సీరియస్ జానర్ లో సాగుతూ సహజత్వానికి కట్టుబడ్డాయి.

Also Read – రాజకీయ బలిపశువులుగా ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు!

మిగిలినవన్నీ బూతుల ప్రహసనంతో నిండినవే. టాలీవుడ్ లో పైన చెప్పిన స్థాయిలో ఏనాడూ ఏ సినిమా ఇన్నేసి కట్లకు గురి కాలేదు. దసరా కూడా సబ్జెక్టు డిమాండ్ చేయడం వల్ల తప్పించి ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న నాని కోరిమరీ ఇలాంటివి పెట్టమని అడగడుగా. ఎలాగూ మ్యూట్లు ఇచ్చేశారు కాబట్టి ఆడియో పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. హింస మోతాదు కూడా తగ్గించేశారు. ఈ సమస్య ఇప్పటిది కాదు బొబ్బిలి పులి టైంలో దాసరి నారాయణరావుగారు నెలల తరబడి ఢిల్లీకి వెళ్తే కానీ సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. అప్పట్లో అదో సెన్సేషన్.

ఆర్ నారాయణమూర్తి అర్ధరాత్రి స్వతంత్రం సమయంలో పోలీసులు మఫ్టీలో థియేటర్ల దగ్గర కాపు కాసేవారు. కోర్టు ఆదేశాల వల్ల ఇదీ చాలా కాలం నిషేధానికి గురయ్యింది. బొంబాయి వచ్చినప్పుడు మతఘర్షణలు రేగుతాయనే కారణంగా చాలా రాష్ట్రాలు విడుదలకు ఒప్పుకోలేదు. మణిరత్నం దీని గురించి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇలాంటి కట్టడి కట్టుబాట్లు బ్యాడ్ కంటెంట్ ఉన్న సినిమాలకు మంచిదే కానీ కేవలం పదాల ఆధారంగా అడ్డు చెప్పడం భావ్యం కాదనేది విశ్లేషకుల మాట. ఇదంతా సరే కానీ ఓటిటికు కూడా వీలైనంత త్వరగా ఈ సిస్టమ్ వస్తే మేలు జరుగుతుంది.

Also Read – బెంగాలీ స్వీట్ VS ధమ్ బిర్యానీనా…?