31,000  retired doctors ready to fight with coronavirus అనధికారిక గణాంకాల ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,200 కు పైగా పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాలు. ఈ కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘి జమాత్ ఈవెంట్‌కు చెందినవి. కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో ఈ మహమ్మారితో పోరాడటానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

మార్చి 25 న ప్రభుత్వం రిటైర్డ్ గవర్నమెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, ప్రభుత్వ రంగ సంస్థ, లేదా ప్రైవేట్ వైద్యులు ముందుకు వచ్చి ఈ ప్రయత్నాలలో చేరాలని విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి 31,000 మంది వైద్యులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తమ సహకారం అందించడానికి ఒప్పుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత వైద్య సదుపాయాల స్థాయికి మించి కేసులు అయినట్లయితే, హోటల్ గదులు, రైల్వే కోచ్లు మొదలైన వాటిలో ప్రభుత్వం అనేక తాత్కాలిక ఆసుపత్రి పడకలను సిద్ధం చేస్తోంది. అప్పుడు వీరి సేవలను ప్రభుత్వం వాడుకోబోతుంది. అవసరాన్ని బట్టి కొంత మందికి గౌరవ వేతనం ఇచ్చి తీసుకోవాలని కూడా ప్రభుత్వం అనుకుంటుంది.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పనిచేయడానికి నిరాకరించినవారిని శిక్షించే అధికారం ఉంటుందని వెల్లడించింది.