3 capitals bill in assembly againవైసీపీ ప్లీనరీలో మళ్ళీ మూడు రాజధానులు ప్రస్తావన చేయడం ఆ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. పరిపాలనా వికేంద్రీకరణ వలనే రాష్ట్రం అభివృధ్ది చెందుతుందని భావిస్తున్నామని కనుక శాసనసభలో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతామని ప్లీనరీలో చెప్పడమే ఇందుకు నిదర్శనం.

హైకోర్టు ఆదేశం మేరకు అమరావతిలో నిర్మాణ పనులు మొదలుపెడున్నామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం, నిధుల సేకరణ కోసం అమరావతిలో భూములను వేలం వేసేందుకు సిద్దం అవుతోంది. అలాగే గ్రూప్-డి ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన అపార్టుమెంటును కూడా లీజుకి ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.

అంటే రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో హైకోర్టును మోసగిస్తున్నట్లు అర్దమవుతోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పేరు చెప్పి అమరావతిలో విలువైన భూములు అమ్ముకొని ఆ సొమ్మును సంక్షేమ పధకాలకో వేరే వాటికో మళ్ళించబోతున్నట్లు అర్దమవుతోంది.

అమరావతి నిర్మాణాన్ని ఆరు నెలలో పూర్తి చేయమని హైకోర్టు ఆదేశించినప్పుడు కనీసం ఆరేళ్ళు పడుతుందని జగన్‌ సర్కార్ చెప్పింది. అంటే ఇప్పట్లో పూర్తవదని స్పష్టం చేసింది. ఇప్పుడు వైసీపీ ప్లీనరీలో మళ్ళీ మూడు రాజధానుల ప్రస్తావన చేయడం ద్వారా అమరావతిని నిర్మించే ఉద్దేశ్యమే తమకు లేదని స్పష్టం చేసినట్లయింది.

రాజధానిలో నిర్మాణపనులు చేస్తున్నామంటూ అటు న్యాయస్థానాన్ని, అమరావతి కోసం ఇచ్చిన భూములను అమ్ముకొంటూ ఇటు రాష్ట్ర ప్రజలను కూడా జగన్‌ సర్కార్ మోసగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.