YS Jagan - Andhra Pradesh Investments
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వింతగా స్పందిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాకా ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టుబడులు తరలిపోతున్నాయి అనే విస్తృతమైన అభిప్రాయం చాలా మందిలో ఉంది. పాత ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రోత్సాహకాలను తిరగదోడడం, కొన్ని ప్రాజెక్టులు రద్దు చెయ్యడం, సంక్షేమ కార్యక్రమాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం దీనికి కారణాలు.

ఆంధ్రప్రదేశ్ లో పాత పీపీఏలను తిరగదోడడంతో దేశం అబాసుపాలు అయ్యిందని, దేశంలోకి వచ్చే కొత్త పెట్టుబడులపై ప్రభావం పడిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా చెప్పడం పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే అటువంటిది ఏమీ లేదని ప్రభుత్వం చెప్పదలచింది.

జూన్ 2019 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 22,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని, ఇంకో 30,000 కోట్ల పెట్టుబడులు రావడానికి సిద్ధంగా ఉన్నయని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇప్పటివరకు ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఆ స్థాయి శంకుస్థాపనలు కూడా జరగలేదు.

వాటి వివరాలు చెప్పమంటే ప్రభుత్వం మాట్లాడకపోవడం విశేషం. గతంలో చంద్రబాబు హయాంలో వచ్చిన కొన్ని పరిశ్రమలకే మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు. కొత్తగా వచ్చినవి ఏమీ కనిపించడం లేదు. ఇటీవలే ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన టీసిఎల్, తోరాయ్ రెండూ చంద్రబాబు హయాంలో వచ్చినవే. దీనితో ఈ 22,000 కోట్ల పెట్టుబడులు, రాబోవు 30,000 కోట్ల పెట్టుబడులు వట్టి మాటలేనా అనే అనుమానాలు రాకమానవు.