TDP-Mahanadu-2023శనివారం సాయంత్రం 5గంటల నుంచి రాజమహేంద్రవరంలో మహానాడు సభలు ప్రారంభం అవుతాయి. కానీ శుక్రవారం సాయంత్రానికే రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా టిడిపి కార్యకర్తలు తరలివస్తుండటంతో మహానాడు జరుగుతున్న వేమగిరి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ముఖ్య నేతలందరూ రాజమహేంద్రవరం చేరుకొన్నారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దానిలో మహానాడులో చర్చించాల్సిన అంశాల అజెండాను, మహానాడులో ప్రవేశపెట్టబోయే 15 తీర్మానాలను ఆమోదించారు.

ప్రజలకు సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలు ఎలాగో టిడిపికి మహానాడు అటువంటిదే. కనుక రాజమహేంద్రవరం పట్టణం టిడిపి జెండాలు, తోరణాలు, బ్యానర్లు, స్వాగత తోరణాలతో కళకళలాడిపోతోంది. మహానాడు సభలకు వచ్చే అతిధులకు నిర్వాహకులు ఏకంగా 200 రకాల వంటలు వండి వడ్డించబోతున్నారు. వీటి కోసం వారం పది రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెట్టడంతో నేడు మహానాడు ప్రాంగణం అంతా ఘుమగుమలాడిపోతోంది.

వేమగిరి, ధవళేశ్వరం జాతీయ రహదారి పక్కన 50 ఎకరాలలో ఈ మహానాడు సభలు జరుగబోతున్నాయి. రెండు రోజుల పాటు సాగే ఈ మహానాడు సభలకు 50 వేల మందికిపైగా టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. కనుక వారి వాహనాల పార్కింగ్ కోసం మరో 50 ఎకరాలను చదును చేసి సిద్దం చేస్తున్నారు.

అందంగా అలంకరించబడిన వేదికతో మహానాడు సభా ప్రాంగణం ఇప్పటికే సిద్దమవడంతో ఈరోజు ఉదయం నుంచే వేదికపై జానపద కళాకారులు, టిడిపి అభిమానులు ఆటపాటలతో చాలా సందడిగా ఉంది. వివిద జిల్లాల నుంచి వచ్చిన టిడిపి నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా కబుర్లు చెప్పుకొంటూ సభాప్రాంగణం అంతా కలియతిరుగుతుంటే పండుగ వాతావరణం నెలకొంది. మహానాడులో కనిపించే ఈ ఉత్సాహమే టిడిపికి టానిక్కులాగ పనిచేస్తుంది. ఒంగోలు మహానాడు తర్వాత టిడిపి ఏవిదంగా పుంజుకొందో అందరూ చూశారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా నారా లోకేష్‌ తన యువగళం పాదయాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందన, ప్రజలు ఏమి కోరుకొంటున్నారనే విషయం ఈ మహానాడు వేదిక ద్వారా టిడిపి శ్రేణులకు చెప్పి వారిలో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేయవచ్చు. ఈ మహానాడు సభలలోనే టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాల గురించి చంద్రబాబు నాయుడు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. కనుక ఈ ఎన్నికల సంవత్సరంలో జరుగుతున్న ఈ మహానాడు టిడిపికి చాలా కీలకమైనది.