2022 Disaster Movies in Tollywoodదర్శకుడు నిర్మాత హీరో ఎవరైనా సరే కావాలని ఫ్లాప్ తీయరు. ఇది జగమెరిగిన సత్యం. అలా అని గుడ్డిగా స్క్రిప్ట్ లో లోటుపాట్లను చూసుకోకుండా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వెళ్తే దెబ్బ పడటం ఖాయం. చరిత్ర ఇది ఎన్నోసార్లు ఋజువు చేసింది. ఈ శనివారం సెలవు తీసుకోబోతున్న 2022లో వచ్చిన డిజాస్టర్లు పరిశ్రమకు చాలా విలువైన పాఠాలు నేర్పిస్తున్నాయి. అవేంటో చూద్దాం. మొదటి పాఠం. కేవలం కాంబినేషన్ల క్రేజ్ మీద సినిమాలు ఆడటం పక్కనపెడితే కనీసం సరైన ఓపెనింగ్స్ కూడా రావని ఆచార్య బాక్సాఫీస్ వసూళ్ల సాక్షిగా అర్థమైపోయింది. కాలం చెల్లిన నక్సలైట్ కాన్సెప్ట్ ని తీసుకుని బంగారం లాంటి కాంబోని చేతులారా వృథా చేసుకున్న కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్ లు దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించారు.

రెండో పాఠం. యూత్ లో ఫాలోయింగ్ ఉందని ఏది బడితే అది కథగా రాసుకుంటే ప్రేక్షకులు మ్యాట్నీకే తిప్పికొడతారు. లైగర్ అనుభవం ప్రతిఒక్కరికి గుణపాఠం. మన దేశంలో పెద్దగా ఆదరణ లేని బాక్సింగ్ క్రీడను తీసుకోవడం ఒక ఎత్తయితే అవసరం లేకపోయినా మైక్ టైసన్ లాంటి ఆకర్షణల మీద తప్ప స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ పెట్టకపోతే ఏమవుతుందో పూరి జగన్నాధ్ కి చాలా బలంగా తెలిసివచ్చింది. తోచింది మాట్లాడ్డమే యాటిట్యూడ్ అనుకున్న విజయ్ దేవరకొండకూ షాక్ తగిలింది. ఇదే లెసన్ అక్షరం పొల్లుపోకుండా వరుణ్ తేజ్ గని రిపీట్ చేసింది. మూడో పాఠం. కేవలం భారీతనానికి ఆడియన్స్ డబ్బులిచ్చేయరు. సాహో ఇక్కడ పోయినా నార్త్ ల లో వర్కౌట్ చేసుకున్న ప్రభాస్ కు రాధే శ్యామ్ రూపంలో దెబ్బ పడింది

నాలుగో పాఠం. మనకు ఎన్ని ఉదాత్తమైన ఆలోచనలు సిద్ధాంతాలు నిజ జీవితంలో చూసిన గొప్ప వ్యక్తిత్వాలు ఉండొచ్చు. అవన్నీ తెరమీద చూపించాలనుకుంటే డ్రామా అవసరం. సినిమాటిక్ ఫ్లేవర్ ఉండాలి. అవేవి లేకుండా సందేశం ఇవ్వాలని చూస్తే విరాట పర్వంలాగా కాంప్లిమెంట్స్ తప్ప కాసులు రావు. రానా వేణు ఊడుగులకు ఇది అనుభవమయ్యింది. అయిదో పాఠం. మాస్ ని మరీ చులకనగా లెక్క కడితే పక్కా కమర్షియల్ లాంటి నేలబారు అవుట్ పుట్టే వస్తుంది. జబర్దస్త్ కాలంలో కాలం చెల్లిన జోకులుతో నవ్వించే ప్రయత్నం చేస్తే అది మారుతీ అయినా సరే పరాభవం తప్పదు. నేను మీకు బాగా కావాల్సినవాడిని ఇదే క్యాటగిరీనే

ఆరో పాఠం. యూత్ ని లక్ష్యంగా పెట్టుకోవాలంటే సాగదీసిన ఎమోషన్లు, పాత చింతకాయ పచ్చడి ఆటోగ్రాఫ్ నెరేషన్లు పని చేయవు. థాంక్ యు, గుర్తుందా శీతాకాలం కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా తేలేకపోయింది ఇందుకే. ఏడో పాఠం. ట్రెండ్ నడుస్తోంది కదాని కథాకథనాల మీద కాకుండా రొమాన్స్, కామెడీ లాంటి అదనపు హంగుల మీద దృష్టి పెడితే ఊర్వశివో రాక్షసివో లాంటి కంటెంట్ ఉన్న రీమేకులు కూడా తేడా కొడతాయి. ఎనిమిదో పాఠం. కథలో సోల్ లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్లతో నింపేస్తే జనాలు టీవీలో చూస్తే చాలనుకుంటారు. అందుకే ది ఘోస్ట్ దెబ్బ కొట్టింది. తొమ్మిదో పాఠం. ఓటిటి కంటెంట్లు థియేటర్ కు పనికిరావని శాకినీ డాకిని, దొంగలున్నారు జాగ్రత్త నిరూపించాయి. పదో పాఠం. అర్థం పర్థం లేని మాస్ ఆఖరికి నిర్మాతకు మిగిల్చేది కన్నీళ్లు నష్టాలే. మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ ఈ కోవలోకే వస్తాయి. 2023లో ఇవి మళ్ళీ జరగకూడదనే సగటు అభిమాని ఆకాంక్ష