2022 Best National Hero Awardకమర్షియల్ గా రాజమౌళి సినిమాలు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “సింహాద్రి” మొదలుకుని “ఆర్ఆర్ఆర్” వరకు ప్రతి సినిమాతో ఒక చరిత్ర సృష్టిస్తోన్న జక్కన్న కలెక్షన్ల లెక్కలను కాసేపు పక్కన పెడితే, తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నాళ్ళుగానో వేచిచూస్తున్న “బెస్ట్ నేషనల్ హీరో” అవార్డు ఈ సారి మన తెలుగు హీరోలకు రాబోతుందన్న నమ్మకాన్ని కలిగించారు.

అవును… “ఆర్ఆర్ఆర్”లో మన ఇద్దరి స్టార్ హీరోల అభినయాన్ని చవిచూసిన తర్వాత ఎలాంటి విమర్శకుడు అయినా దీనిని అంగీకరించే విధంగా, మన ఇరువురు స్టార్ హీరోలు అద్భుతమైన అభినయాన్ని సిల్వర్ స్క్రీన్ పై పండించారు. ఈ ఏడాది ముగియడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం మిగిలి ఉంది, మరి దీనికి మించిన నటనను మరే హీరో ప్రదర్శించలేరా? అంటే… కధకు తగిన విధంగా నటించవచ్చు, ఇంకా చెప్పాలంటే జీవించవచ్చు.

కానీ “ఆర్ఆర్ఆర్” స్థాయి నటన మాత్రం చాలా అరుదుగా లభించే అవకాశం. అంతటి కధాబలాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన ‘రాజమౌళి అండ్ టీమ్’ నిజంగా అభినందనీయులు. ఇక మన హీరోల విషయానికి వస్తే… సమకాలీకులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తెర మీద ఒకరికి మించి మరొకరు పోటీ పడి మరీ నటించారు. అంతటి అవకాశం జక్కన్న కల్పించారు కూడా!

ఒకరేమో క్రూరంగా ప్రవరిస్తూనే, అందులో బాధను, ప్రేమను కళ్ళతోనే చూపించే విధంగా మెప్పిస్తే… మరొకరు ఏమీ తెలియని అమాయకుడిగా ఉంటూ, అందులో భయాన్ని, పౌరుషాన్ని కళ్ళల్లోనే నింపి ప్రేక్షకులకు కనువిందు చేసారు. కమర్షియల్ సినిమాలలో ఇలాంటి పాత్రలు లభించడం చాలా అరుదైన అవకాశం. వాటిని మన ఇద్దరు తెలుగు హీరోలు ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన వైనం వెండితెరపై వీక్షించవచ్చు.

నటులుగా “ఆర్ఆర్ఆర్”కు ముందు, తర్వాత అని చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తారక్ – చరణ్ ల కెరీర్ ఉండబోతోందని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే… ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కూడా ఒకే షాట్ లో రెండు హావభావాలు ప్రదర్శించగలగాలి, అది కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా! వాటిని ఎంతో అద్వితీయంగా పండించడంలో ఎన్టీఆర్ – చరణ్ లిద్దరూ కూడా నూటికి నూరు శాతం విజయవంతం అయ్యారు.

మూడేళ్ళ కృషి, పట్టుదల, కేటాయించిన సమయం అన్నీ కూడా మనకు ధియేటర్ లో చూసినపుడు ప్రతి షాట్ లో కనపడతాయి. నిజంగా ఈ క్యారెక్టర్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు ఇద్దరూ చేసిన కృషి అనిర్వచనీయం, అభినందనీయం. అందుకే ఈ ఇద్దరి హీరోల అభిమానులే కాదు, “ఆర్ఆర్ఆర్”కు యావత్తు సినీ లోకం, ప్రేక్షక ప్రపంచమంతా నీరాజనాలు పలుకుతూ, పెట్టిన పెట్టుబడికి రెండు, మూడింతలు వచ్చే విధంగా తిరిగి ఇచ్చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ హీరోకు “నేషనల్ అవార్డు” అనేది ఎప్పటినుండో ఇండస్ట్రీలో నలుగుతున్న విషయం. నిజానికి ఆనాటి “అల్లూరి సీతారామరాజు” పాత్ర పోషించిన సూపర్ స్టార్ కృష్ణకు ఎందుకు జాతీయ అవార్డు లభించలేదోనని పలుమార్లు మహేష్ తో పాటు చాలా మంది ప్రముఖులు బహిరంగంగానే ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అప్పటి నుండి ఓ కలగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, 2022 ఏడాదికి గానూ ఖచ్చితంగా తెలుగు హీరో పరమే అవుతుందన్న విశ్వాసాన్ని “ఆర్ఆర్ఆర్” సినిమా ఇచ్చింది.

ఇప్పుడే జాతీయ అవార్డు గురించి ప్రస్తావించడం అతిశయోక్తిగా అనిపించినా, నిజంగా ఆ అవార్డుకు కొమరం భీమ్ క్యారెక్టర్ వేసిన జూనియర్ ఎన్టీఆర్ గానీ, అల్లూరి సీతారామరాజు పాత్ర ధరించిన రామ్ చరణ్ గానీ ఇద్దరూ అర్హులే. మల్టీస్టారర్ మూవీ కనుక, ఈ ఇద్దరు హీరోలకు కలిపి ప్రకటిస్తే, అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు కదా! నాటి ‘అల్లూరి’తో సాధించలేనిది నేటి ‘అల్లూరి’తో కలిపి “డబుల్ బొనాంజా”గా వస్తుందేమో వేచిచూద్దాం.