Corona Cases Increasing At Concerning Levels in Indiaరోనా రక్కసి కారణం దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసుకుపోయాయి. సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. పరిస్థితి ఎప్పటికి సర్దుకుంటుందో ఎప్పటికి అన్నీ స్టార్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. కరోనా ప్రభావం కారణంగా భారతీయ సినీ పరిశ్రమ ఏకంగా రూ.1500 కోట్లు నష్టపోనుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

పరిశ్రమ మీద ఆధారపడ్డ వర్గాల నష్టాలు కూడా కలిపితే ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కో వీకెండ్‌కు ఇండియన్ సినిమాకు రూ.400 కోట్ల చొప్పున నష్టం కలుగుతోందట. బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలైన `సూర్యవంశీ`, `83` వంటివి కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తెలుగులో ఈ నెలలో ఉగాదికి విడుదల కావాల్సిన వీ, ఒరేయ్ బుజ్జిగా వాయిదా పడ్డాయి.

మార్చి 31 తర్వాత పరిస్థితి చక్కబడుతుందా అని పరిశ్రమ ఆశగా ఎదురుచూస్తుంది. ఇది ఇలా ఉండగా…. భారత్‌లో మార్చి 31 తర్వాత పరిస్థితి సద్దుమణిగినప్పటికీ ఓవర్సీస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఆమెరికాతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ వంటి దేశాల్లో మే నెల చివరి వరకు థియేటర్లు, మాల్స్ తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

కొన్ని దేశాలలో ఏకంగా జులై వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు. దీనితో పెద్ద సినిమాలు అయితే ఓవర్సీస్ మార్కెట్ ని వదులుకోవడమో లేక పూర్తిగా తమ సినిమాలు వాయిదా వేసుకోవడమో చెయ్యాలి. ఈ నేపథ్యంలో ఈ నష్టం మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 2020లో ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉండబోతుంది అనేది ఇప్పటికే కంఫర్మ్ అయిపోయినట్టే!