2000-rupees-note-has-no-chipకొత్తగా విడుదలైన 2000 రూపాయల నోటుపై రకరకాల పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లకుభేరులకు వీలుకాని రీతిలో ఈ నోటు ఎక్కడా ఉన్నా, శాటిలైట్ ద్వారా కనిపెట్టే విధంగా ఇందులో ఓ మైక్రో ‘చిప్’ను అమర్చారని వదంతులు పుట్టుకొచ్చిన సంగతులు విదితమే. దీనికి తోడు 2 వేల రూపాయల నోటు పైన శాటిలైట్ మాదిరి ఉన్న చంద్రయాన్ బొమ్మ కూడా ఉండడంతో సాధారణ ప్రజానీకం కూడా ఈ వార్తలను నమ్మడం ప్రారంభించారు. కానీ, ఆర్బీఐ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదు, కేవలం అది కూడా ఒక కరెన్సీ నోటు మాత్రమేనని స్పష్టం చేసారు.

అయితే ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా..!’ ఏమీ లేకుండా ఈ 2000 రూపాయల నోటు పైనే ఎందుకు ఈ వార్తలు వచ్చాయి అంటే… ‘చావు కబురు చల్లగా’ చెప్పారు ఆర్బీఐ అధికారులు. 2000 రూపాయల నోటులో నానో చిప్ పెట్టాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే ఈ తరహా కరెన్సీని తయారు చేయడానికి వ్యయం ఎక్కువ అవుతుండడంతో సదరు ప్రతిపాదనను విరమించామని బెంగుళూరులో ఉన్న ఓ ఆర్బీఐ అధికారి తాజాగా ప్రకటించారు.

ముద్రణ ఒక్కటే కాక, సదరు నానో చిప్ తో కూడిన నోట్లు కోసం ప్రత్యేక స్కానింగ్ యంత్రాలు కూడా అవసరం అవుతుండడం, అవి మరింత భారం కావడంతో, సదరు ప్రతిపాదనను పూర్తిగా విరమించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటులో ఎలాంటి నానో చిప్ లేదని మరోసారి ధృవీకరించారు. దీంతో 2000 రూపాయల నోటులో నానో చిప్ అనేది ఒట్టి పుకారు కాదని, ముందుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చేసిన ఆలోచనలేనని స్పష్టమవుతోంది.