2000-new-note-water-quality-testప్రస్తుతం దేశంలో 2 వేల రూపాయల నోటుపై పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. చూడడానికి ఆకతాయితనంగా, చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువు మాదిరి ఉండడంతో… ఈ 2 వేల రూపాయల నోటు లుక్ పరంగా ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు సెక్యూరిటీ రీత్యా కూడా విమర్శలు వ్యక్తమైన నేపధ్యంలో… ఈ నోటు అంతు తేల్చేందుకు పలువురు నడుంకట్టి పరీక్షలు జరుపుతున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రధానంగా 2000 రూపాయల నోటు కలర్ పోతుందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో, ఈ నోటును పది నిముషాల పాటు నీళ్ళల్లో నానబెట్టి మరీ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ టెస్టింగ్ లలో తేలింది ఏమిటంటే… రంగు పరంగా ఈ నోటుకు ఎలాంటి డోఖా లేదని, అంతసేపు నీళ్ళల్లో ఉన్నప్పటికీ, ఏ మాత్రం రంగు పోలేదని సదరు ప్రయోగాలు చేసిన వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. మరికొందరైతే… ఈ నోటును ట్యాప్ కింద, షవర్ కింద కడుగుతూ దర్శనమిస్తున్నారు.

అలాగే ఈ నోటులో ఎలాంటి జీపీఆర్ఎస్ ట్రాకింగ్ డివైజ్ లేదని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేసినప్పటికీ, దీనిపై సందేహం కలిగిన పలువురు ఔత్సాహికులు, దీనిపై కూడా టెస్టింగ్ లను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నోటుకు సంబంధించిన టెస్టింగ్ వీడియోలు యూట్యూబ్ లో విపరీతమైన క్లిక్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలాగే సోషల్ మీడియాలలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.