18-pages-Movie-Talkఒక భాషలో సినిమా హిట్ అయితే అదేం పెద్ద విషయం కాదు కానీ హిందీ ఇతర భాషల్లో సక్సెస్ అయితే బడ్జెట్ తో సంబంధం లేకుండా దానికి ప్యాన్ ఇండియా కలరింగ్ వచ్చేస్తుంది. హిట్ రేంజ్ ని బట్టి సదరు హీరో మార్కెట్ పెరగడమూ అవకాశాలు క్యూ కట్టడమూ జరుగుతాయి. కెజిఎఫ్ ముందు వరకు కర్ణాటక దాటి బయట ఎవరికీ తెలియని యష్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇదెంత ఒత్తిడి తెచ్చిందంటే నెక్స్ట్ ప్రాజెక్టు ఓకే చేయడానికి నెలల తరబడి టైం తీసుకున్నాడు. కొందరికి ఓకే చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయిన దాఖలాలు రెండు మూడు ఉన్నాయి.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు సైతం ఇదే ఇమేజ్ మేకోవర్ ని ఎంజయ్ చేస్తున్నారు కానీ ఈ ట్రెండ్ కొందరికి పని చేయడం లేదు. దానికి ఉదాహరణగా నిఖిల్ నిలుస్తున్నాడు. కార్తికేయ 2 రిలీజయ్యాక బాలీవుడ్ లోనూ దీనికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది. నార్త్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. కృష్ణ తత్వాన్ని థ్రిల్లర్ కాన్సెప్ట్ కి ముడిపెట్టిన తీరు వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇంకేం నిఖిల్ కు ఇండియా వైడ్ గుర్తింపు వచ్చిన మాట వాస్తవం. అయితే విచిత్రంగా దాని ప్రభావం తాజాగా విడుదలైన 18 పేజెస్ మీద ఏ మాత్రం పడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, రంగస్థలం పుష్ప ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సుకుమార్ రచన, అనుపమ పరమేశ్వరన్ జోడి ఇవేవి సానుకూలంగా పని చేయలేదు. మరీ బ్యాడ్ కాదు కానీ ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదు. సో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కార్తికేయ 2 క్రెడిట్ లో అధిక శాతం కంటెంట్ కు చెందుతుంది తప్ప దాని వల్ల నిఖిల్ కు కలిగిన మేలు తక్కువే. ఒకవేళ నిజంగా ప్లస్ అయ్యుంటే 18 పేజెస్ కి హెవీ ఓపెనింగ్స్ రావాలి. ధమాకా పోటీ ఉంది కాబట్టి తగ్గిందని కవర్ చేయడానికి లేదు. ఎందుకంటే మొదటి రోజు దానికొచ్చిన రివ్యూలు రిపోర్ట్ లూ యావరేజే. కాబట్టి ఆ ఒక్కటి కారణంగా చూపించి 18 పేజెస్ ని డిఫెండ్ చేయలేం

ఆ మాటకొస్తే కార్తికేయ 2 టైంలోనూ విపరీతమైన పోటీ ఉంది. సరిగ్గా తొమ్మిది రోజుల ముందు వచ్చిన సీతారామం, బింబిసార భీభత్సంగా ఆడుతున్నాయి. ఒక రోజు ముందొచ్చిన మాచర్ల నియోజకవర్గం థియేటర్ కౌంట్ ని తగ్గించింది. ఇంకో వారంలో లైగర్ కోసం స్క్రీన్లను బ్లాక్ చేసి ఉంచారు. ఇన్ని ప్రతికూలతలను తట్టుకుని కార్తికేయ 2 ప్రేక్షకులను మెప్పించింది ఆడింది. సో నిఖిల్ పేరు మీద బ్రాండ్ మీద అన్నీ కథలు ఒకే రీతిలో మార్కెట్ కావనే క్లారిటీ వచ్చేసింది. సో ఇకపై తాను ఎంచుకునే కథల విషయంలో జాగ్రత్తగా ఉంటూ వీలైనంత ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడక తప్పేలా లేదు. కమర్షియల్ మూసకు పోనవసరం లేదు కానీ కంటెంట్ పరంగా ఎక్కువ బరువు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది