15 lakhs fake 2000 rupees notes in vijayawadaమన దేశంలో ఫేక్ కరెన్సీకి కొదవలేదన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే తాజాగా మోడీ ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ సంగతి పక్కనపెడితే ఫేక్ కరెన్సీని పూర్తిగా నియత్రించినట్లయ్యింది. గతంలో దేశంలో ఉన్న ఫేక్ మరియు తాజాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి దిగుమతి కానున్న ఫేక్ మొత్తం ఒక్క దెబ్బతో పటాపంచలయ్యింది. దీంతో గతంలో ఫేక్ నోట్లతో ఇబ్బందులు చవిచూసిన ప్రజానీకం అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కరెన్సీ నోట్ల కోసం పడుతున్న కష్టాలు పక్కన పెడితే, కనీసం చేతిలో ఉన్న నోట్లు నిజమైనవేనని గుడ్డిగా నమ్మేయోచ్చు అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేసారు.

అయితే ఇంతలోనే కలకలం… కొత్తగా ముద్రించిన 2000 రూపాయల నోట్లకు కూడా ఫేక్ వచ్చేసిందని..! ఇంకేముంది సర్వత్రా మళ్ళీ ఆందోళన..! ఆర్బీఐ విడుదల చేసిన రెండు రోజుల్లోనే పాకిస్తాన్ నుండి ఫేక్ కరెన్సీ వచ్చేసిందా? అన్న అనుమానం వ్యక్తమయ్యింది. అయితే అవి ఫేక్ నోట్లు కాదు, కలర్ జిరాక్స్ లని పోలీసులు తేల్చడంతో కొంత ఉపశమనం పొందారు. దీంతో ఇండియాను దెబ్బతీయాలన్న పాకిస్తాన్ ఆలోచనలు ఇంకా కార్యరూపం దాల్చలేదని, 2000 రూపాయల నోటు పటిష్టమైన సెక్యూరిటీతో ముద్రించడంతో దీనికి ఫేక్ నోట్లు సృష్టించడం అసాధ్యం అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అయితే ఇదంతా గత 10 రోజులుగా జరుగుతున్న విషయం. కానీ, శనివారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. వరంగల్ కు చెందిన ఓ బ్లాక్ మనీ హోల్డర్ తన వద్దనున్న 20 లక్షల విలువైన పాత నోట్లను 15 లక్షలతో గల కొత్త నోట్లతో మార్చుకునేందుకు విజయవాడకు చెందిన ఒక ముఠాతో డీల్ కుదుర్చుకుని… ఆ తంతు ముగించేసాడు. తీరా కొత్తగా తీసుకున్న 15 లక్షల రూపాయలు కూడా పూర్తిగా ఫేక్ నోట్లని తేలడంతో నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది. అయితే తను మార్చుకున్న మొత్తం బ్లాక్ మనీ కావడంతో ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఆ మొత్తాన్ని తగలబెట్టేసి, స్థానిక మీడియాకు కొన్ని నోట్లు ఇచ్చి తన గోడు వెలిబుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సంఘటనలో సదరు నల్లకుభేరుడు ఎవరన్నది, అతను ఏం చేసాడన్నది పక్కనపెడితే, అసలు 15 లక్షల విలువైన కొత్త నోట్లు ఎక్కడ నుండి వచ్చాయి. అంతకు ముందు ఆకతాయిలు నాలుగైదు నోట్లను కలర్ జిరాక్స్ ల ద్వారా చలామణి చేద్దామని ప్రయత్నించారు. మరి ఇంత పెద్ద మొత్తం కూడా కలర్ జిరాక్స్ పనేనా? లేక సెక్యూరిటీ పరంగా ‘కింగ్’ అని చెప్పిన 2000 రూపాయల నోటుకు ఫేక్ వచ్చేసిందా? ఈ అనుమానాలే సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే… ప్రస్తుతం చలామణి అవుతున్నదంతా 2 వేల రూపాయల నోట్లే కావడంతో, చేతిలో ఉన్నది ఒరిజినలో, ఫేకో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.

నిజంగా అవి ఫేక్ నోట్లే అయితే ఇంత ఫాస్ట్ గా 2000 రూపాయల నోటుకు ఫేక్ ను సృష్టించే సత్తా పాకిస్తాన్ సొంతమా? లేక మన వాళ్ళే ‘లోకల్ టాలెంట్’ను ప్రదర్శించారా? పోలీసు విచారణలో ఏం తేలనుందో గానీ, ప్రధాని మోడీ ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారో, అది కాస్త పక్కదారి పడితే మరిన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్లాక్ మనీ రాయుళ్ళతో పాటు ఈ ఫేక్ నేరగాళ్ల పని పట్టే బాధ్యత కూడా తనపై ఉందన్న విషయాన్ని ప్రధాని గుర్తించాలి. అంతకుముందు ఒక్క ఫేక్ నోటు వస్తే… అది 500 రూపాయలకే పరిమితం. కానీ ఇప్పుడు ఫేక్ నోటు అయితే ఆ “గుండె బరువు” నాలుగింతలు కానుంది… అందుకే సామాన్యుడి ఆవేదన..!