Jagan Tax‘పధకాల పేరుతో బోలెడు బోలెడు డబ్బులు ఇస్తున్నాము తిరిగి మళ్ళీ కట్టలేరా’ అంటూ చెత్త పన్ను విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ బహిరంగంగానే ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెత్త పన్ను ఆస్తి పన్ను, రవాణా పన్ను… ఇలా ప్రజలకు తెలిసిన ప్రాముఖ్యమైన పన్నులే కాదు, ఇంకొన్ని పన్నులు ఏపీలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా ప్రముఖుల దినపత్రిక ప్రజాశక్తి ఓ ప్రత్యేక కధనం ప్రచురించింది.

ఇందు నిమిత్తం ఆర్ధిక శాఖామంత్రివర్యులు బుగ్గన 13 రకాల కొత్త పన్నులపై అధ్యయనం చేస్తున్నారట. దీని కోసం పాత గణాంకాలన్నీ తిరగ తోడుతున్నారట. గతంలో పలు ప్రభుత్వాలు విధించిన పన్నులను అధ్యయనం చేయడం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 13 రకాల కొత్త పన్నులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతుందేమో అన్నది ఈ ప్రచురణ సారాంశం.

ఈ దిశగా నేడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరపబోతున్నారట. రానున్న ఆర్ధిక సంవత్సరం 2022-23 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రాష్ట్రానికి సమకూర్చాల్సిన రెవిన్యూ ప్రణాళికలో ఈ కొత్త పన్నులు చేరవచ్చనేది ఓ అంచనా. ఇదే గనుక కార్యరూపం దాలిస్తే, ఏపీ ప్రజలకు ప్రభుత్వం నుండి ఎదురయ్యే అతి పెద్ద షాక్ గా పరిగణించవచ్చు.

ఇప్పటికే అమలు చేసిన అనేక రకాల పన్ను పెంపులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గ్రీన్ టాక్స్ పెంపు రవాణా చేసే వాహన దారులకు చుక్కలు చూపిస్తోంది. అలాగే పెరగనున్న విద్యుత్ చార్జీల ప్రకటనలు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. ఇప్పటికే అమలైన చెత్త పన్ను, ఆస్తి పన్నులు, నీటి కుళాయి పన్ను, గ్రంధాలయ పన్ను, డ్రైనేజీ పన్ను… ఇలా వివిధ రకాలైన పన్నుల భారం ప్రజల నెత్తిన పడింది.

దీంతో ‘టాక్స్’ అన్న పదం వింటేనే ప్రజల వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మరో 13 కొత్త పన్నులంటే భరించే స్థితిలో ప్రజలు ఉన్నారా? అనేది ప్రశ్నార్ధకమే. 13 కాకపోయినా, 3 కొత్త పన్నులైనా చాలు… ప్రజల నడ్డి విరగడానికి! పేద ప్రజల సంక్షేమమే లక్ష్యమని చెప్తోన్న జగన్ సర్కార్ మరి అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.