1000 rupees fake notes deposited in banksనవంబర్ 8వ తేదీ… సాయంత్రం 8 గంటలకు… అప్పటివరకు ప్రజల జేబుల్లో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను ఈ అర్ధరాత్రి నుండే రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అర్ధాంతరంగా ఎందుకు ఈ ప్రకటన చేసారు అన్న ప్రశ్నకు… మోడీ సర్కార్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే… “నల్లకుభేరులకు షాక్ ఇవ్వడం” అన్నారు. సరే… ఏదో మంచిపని తలపెట్టింది కదా అని ప్రజలంతా సర్కార్ కు సహకరించి, గంటల కొద్దీ క్యూలలో నిలబడి నోట్లను మార్చుకున్నారు, అలాగే అకౌంట్ లలో డిపాజిట్లు చేసుకున్నారు.

అయితే అంచనాలకందని విధంగా నోట్ల మార్పిడి, అకౌంట్ డిపాజిట్ లు చేసుకోవడంతో నవంబర్ 24వ తేదీ నుండి నోట్ల మార్పిడి లేదు, కేవలం ఎకౌంటులలో వేసుకోవడమే అన్న నిబంధన తీసుకువచ్చారు. ఇలా నవంబర్ నెలాఖరుకు వచ్చే సమయానికి మొత్తం 500, 1000 నోట్ల విలువ దాదాపుగా 11 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఆర్బీఐ దగ్గర మరియు బ్యాంకుల దగ్గర ఉన్న నిల్వలు కూడా లెక్కిస్తే… ఇప్పటికే దేశంలో బ్లాక్ మనీ ఉండకూడదు. కానీ, జనాల దగ్గర ఇప్పటికీ 500, 1000 నోట్లు విరివిగా ఉన్నాయి.

అంటే దీనినేమి అర్ధం చేసుకోవాలి మహానుభావా… అంటూ ప్రధానిని వేడుకోవడం ప్రజల వంతవుతోంది. ముద్రించిన నోట్ల కంటే ఎక్కువగా బ్యాంకులకు చేరుకోవడం అనేది ఏ రకంగా అర్ధం చేసుకోవాలి? మరో నెల రోజుల పాటు సమయం ఉండడంతో ఖచ్చితంగా ఓ 3 లక్షల కోట్లు ఇంకా బ్యాంకులకు చేరుకుంటాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి అంటే… ఫేక్ కరెన్సీ కూడా అధికారికమైందా? లేక రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 500, 1000 నోట్లను తక్కువగా లెక్కించిందా?

అసలు గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఈ లెక్కలతో అసలు దేశంలో బ్లాక్ మనీ అనేది లేకుండా పోయిందా? చలామణిలో ఉన్నదంతా తెల్లధనమేనా? ఒక రకంగా పెద్ద నోట్ల రద్దును ప్రవేశపెట్టి నల్లకుభేరులకు మోడీనే దోహదపడ్డారా? అన్న విశ్లేషణలను మీడియా వర్గాలు అందిస్తున్నాయి. 20, 30 శాతం కమీషన్లతో నల్లకుభేరులంతా దొడ్డి దారిన కొత్త నోట్లను మార్చేసుకున్నారన్న సంఘటనలు గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులే స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా నల్లకుభేరులకు షాక్ ఇద్దామని భావించిన ప్రధాని మోడీకే దిమ్మతిరిగే షాక్ ను నల్లకుభేరులు ఇచ్చినట్లుగా అర్ధమవుతోంది.