100 deaths per day means that much less jaganఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభకు ఏకరువు పెట్టారు. గతంలో దేశంలోనే తొలిసారిగా కరోనా వాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ మీద రాజకీయ పరమైన ఆరోపణలు చేసి వివాదాస్పదమైన ముఖ్యమంత్రి మళ్ళీ అటువంటి వ్యాఖ్యలే చేశారు.

భారత్‌ బయోటెక్‌ స్వయంగా రామోజీరావు కుమారుడి వియ్యంకుడిదే అంటూ మరో సారి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగా సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనే నియమం ఉంటుంది. పైగా ఏకంగా సభలో సభ్యుడు కాని వారి మీద కూడా ముఖ్యమంత్రి నిందలు వేసినట్టుగా మాట్లాడేశారు.

అయితే మాట్లాడుతుంది ముఖ్యమంత్రి కాబట్టి స్పీకర్ కూడా ఆయనను ఆపే ప్రయత్నం చెయ్యలేదు. మరోవైపు… నిన్నటి కోవిడ్ బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజే 106 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం యొక్క వారం రోజుల కోవిడ్ మృతుల సంఖ్య కూడా 100గా ఉంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం మరణాల రేటును తగ్గించగలుగుతున్నాం అని చెప్పుకొచ్చారు.

“కోవిడ్‌ కేసులను వెంటనే గుర్తించి వేగంగా వైద్యం అందించడం ద్వారానే మరణాల రేటును తగ్గించగలుగుతున్నాం. నర్సులు, డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లు, అధికారుల కృషి వల్ల.. కోవిడ్‌ మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనమూ ఉన్నాం,” అని ముఖ్యమంత్రి సభలో చెప్పారు. అయితే రోజుకు 100 చావులు అంటే తక్కువా జగన్? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.