1 Nenokkadine' gets Tamil TRP ratingsప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “రంగస్థలం 1985” సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ ను ఈ స్థాయిలో నిలబెట్టిన సినిమా అంటే, అది “1 నేనొక్కడినే” అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, చెర్రీ వంటి స్టార్ హీరోలు సుకుమార్ కు క్యూ కట్టారు. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా, ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అయిన ఈ సినిమాకు ఒక్క తెలుగు నాటే కాదు, తమిళంలో కూడా వీరాభిమానులు ఉన్నారన్న విషయం తాజాగా బహిర్గతమైంది.

తెలుగు హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబుకు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం, గత ఆదివారం నాడు బుల్లితెరపై ప్రసారం అయిన ఈ సినిమా నిరూపించింది. ఏదో ప్రసారం అయ్యింది కదా అంటే అయ్యిందని కాదు, డబ్బింగ్ చిత్రాల టీఆర్పీ రేటింగ్స్ రికార్డును బద్దలుకొట్టింది ఈ “1 నేనొక్కడినే.” ఇప్పటివరకు తమిళ బుల్లితెరపై ‘బాహుబలి 1, ఈగ, మగధీర’ సినిమాలే వరుసగా మూడు స్థానాలలో నిలిచాయి. ఈ మూడు కూడా రాజమౌళి నుండి వచ్చినవి కావడం విశేషం.

ఈ జక్కన్న చిత్రాలను అధిగమించి, కోలీవుడ్ ట్రేడ్ వర్గాలకు సుక్కూ – ప్రిన్స్ కాంబో షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఊహించని ఈ ఆదరణతో కోలీవుడ్ లో మహేష్ అన్న నామధేయం మరో సారి హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. కొత్తదనంతో కూడిన కధలను ఆదరించడంలో తెలుగు కంటే తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా మరోసారి నిరూపణ అయ్యింది. అలాగే “స్పైడర్” ద్వారా త్వరలో తమిళ ప్రేక్షకులకు చేరువ కావాలనుకుంటున్న మహేష్ ఫ్యాన్ రేంజ్ ను కూడా ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు చూపించినట్లయ్యింది.