$1 Million  for AKHANDA ROAR in USAపక్కా క్లాస్ మార్కెట్ గా యుఎస్ కు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ‘జాతిరత్నాలు’ వంటి చిన్న సినిమా కూడా 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి అవలీలగా చేరిపోయింది. అలాంటి క్లాస్ మార్కెట్ లో లేటెస్ట్ మాస్ ధమాకా “అఖండ” అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకుని 1 మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది.

రిలీజ్ కు ముందు వరకు యుఎస్ మార్కెట్ లో ఇంత మొత్తం అంచనాలు వేసింది కాదు. బోయపాటి – బాలయ్య కాంబోలో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్లు ఉన్నప్పటికీ, అవి యుఎస్ లో అంతటి సక్సెస్ లు సొంతం చేసుకోలేదు. దీంతో 1 మిలియన్ అనేది విడుదలకు ముందు వరకు ‘అవుట్ అఫ్ సిలబస్’లోనే ఉంది. బహుశా ఈ కారణంతోనే లాభాపేక్షణలో ‘అఖండ’ యుఎస్ పంపిణీదారులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో ఫస్ట్ 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన బాలయ్యకు ‘అఖండ’ రెండవది. ఇండస్ట్రీలో భారీ హిట్లు సొంతం చేసుకున్న బోయపాటికి ఇదే తొలి 1 మిలియన్ డాలర్స్ మూవీ. మాస్ డైరెక్టర్ గా ఏపీ, తెలంగాణాలలో బోయపాటికి విశేషమైన మార్కెట్ ఉన్నప్పటికీ, యుఎస్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా 1 మిలియన్ సొంతం చేసుకోలేదంటే, మాస్ మూవీస్ కి యుఎస్ ఆడియన్స్ ఇచ్చే తీర్పు అర్ధం చేసుకోవచ్చు.

అలాంటి మార్కెట్ ను కూడా ఊపేసిన ఘనత నందమూరి నటసింహం బాలకృష్ణదే. అఘోరా పాత్రలో ‘అఖండ’గా బాలయ్య విశ్వరూపం ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైనది. మరో నాలుగు రోజుల్లో మరో మాస్ మూవీ “పుష్ప” కూడా రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా కూడా ఊర మాస్ జోనర్ కావడంతో, యుఎస్ ప్రేక్షకుల స్పందన సినీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

అయితే ‘పుష్ప’ విషయంలో… దర్శకుడిగా సుకుమార్ కు ఇప్పటికే యుఎస్ మార్కెట్ పై పట్టు ఉంది. అలాగే హీరోగా బన్నీకి మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ ఊర మాస్ జోనర్ చిత్రాలకు ఆదరణ మాత్రం అంతంతే! దీంతో ‘పుష్ప’లో ఉన్న కంటెంట్ డామినేట్ చేస్తుందా? లేక సుక్కు, బన్నీలకున్న మార్కెట్ తో యుఎస్ లో ‘పుష్ప’ లాభదాయకంగా మారుతుందా? అనేది చూడాలి.