1.29 lakh cuts in Ammoodi scheme  జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి గొప్పగా చెప్పుకొంటున్న అమ్మఒడి పధకం నిర్వహణ భారంగా మారుతుండటంతో ఆ భారం తగ్గించుకొనేందుకు రకరకాల ఎత్తులు వేస్తోంది. ఈ పధకం ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం ఎటువంటి షరతులు విధించకుండా రాష్ట్రంలో విద్యార్దులందరికీ దీనిని వర్తింపజేయడంతో 2020లో 43 లక్షల మంది, 2021లో 44.48 లక్షల మంది అయ్యారు. అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరుగుతుందని వేరే చెప్పక్కరలేదు.

కనుక నానాటికీ పెరిగిపోతున్న ఈ భారం తగ్గించుకొనేందుకు ప్రభుత్వం పలు షరతులు, నిబందనలు విధించి లబ్దిదారుల సంఖ్యను క్రమంగా తగ్గించడం ప్రారంభించింది. విద్యార్దులకు 75 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే అమ్మఒడి పధకం లభించదని చెప్పింది. తరువాత 300 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్నవారిని ఈ పధకం నుంచి తప్పించేసింది. కొత్త బియ్యం కార్డు తీసుకోకపోయినా, బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసుకోకపోయినా అమ్మఒడి లభించదు.

గత ఏడాది కరోనా కారణంగా తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపలేదు. దాంతో చాలా మందికి 75 శాతం కంటే తక్కువ హాజరు నమోదైంది. కనుక కొత్త నిబందనల ప్రకారం వారందరినీ ఈ పధకం నుంచి తప్పించేసింది.

అమ్మఒడి పధకం-మూడో విడతలో ఈ నెల 27వ తేదీన విద్యార్దుల తల్లులు బ్యాంక్ ఖాతాలలో సొమ్ము జమా చేయనున్నందున విద్యాశాఖ అర్హులైన లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. గత ఏడాది 44.48 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఈ ఏడాది కొత్త నిబందనల కారణంగా వారి సంఖ్య 43.19 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 1.29 లక్షల మందిని అమ్మఒడి నుంచి తప్పించేసిందన్న మాట!

మళ్ళీ ఈ 43.09 లక్షల మందిలో 1.46 లక్షల మంది బ్యాంకులలో కేవైసీ ప్రక్రియ పూర్తిచేయనందున తాత్కాలికంగా వారినీ పక్కన పెట్టింది. వారు కేవైసీ చేసుకొని అన్ని ధ్రువపత్రాలు చూపిన తరువాత అమ్మఒడి సొమ్ము విడుదల చేస్తామని అధికారులు చెపుతున్నారు.

ఇదికాక ప్రైవేట్ పాఠశాలలో చదువుకొనే విద్యార్దులకు ఇస్తున్న అమ్మఒడి పధకంలో నుంచి రూ.2,000 ప్రభుత్వం కోసుకొంటోంది. ఆ సొమ్మును ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్ల నిర్వహణకు ఖర్చు చేస్తామని చెపుతోంది.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూసుకోకుండా ఓట్ల కోసం ఇటువంటి ఆచరణ సాధ్యం కాని పధకాలు ఆర్భాటంగా ప్రకటించడం, ఆ తరువాత వాటిని యదాతదంగా అమలుచేయలేక ఈవిదంగా నిబందనలు, నిర్వహణ ఖర్చుల పేరుతో క్రమంగా కత్తెర వేస్తుండటం దేనికి?పధకాలు ఇవ్వకపోతే జరిగే నష్టం కంటే ఇచ్చి ఈవిదంగా తొలగించడం వలన జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని వైసీపీ ప్రభుత్వం గ్రహించినట్లు లేదు. కనుక తల్లుల ఆగ్రహానికి గురికాక తప్పదు.