Saurav Ganguly to join BJPలెజెండరీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సహకరించారు. హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గంగూలీ వెంట ఉండటంతో పోటీకి ఎవరూ సాహసించలేదు. మరోవైపు గంగూలీ త్వరలో బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో కూర్చున్నారు. 2021లో జరగబోతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో గంగూలీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ భావిస్తోందట. మమతా బెనర్జీని ఓడించాలంటే గంగూలీ లాంటి ప్రజాకర్షణ కలిగిన నేత అయితే మేలు అని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందట.

ఇకపోతే గంగూలీతో పాటు బీసీసీఐ కార్యదర్శి పదవికి జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు) కూడా నామినేషన్ వేశారు. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. 47 ఏళ్ళ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా ఉన్నారు.

బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా రెండో పర్యాయం పనిచేస్తున్న గంగూలీ.. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం 2020, సెప్టెంబరు తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. బీసీసీఐలో రెండు పర్యాయాలు ఏ పదవులైనా చేపట్టిన తర్వాత సభ్యులు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది.