Virat-Kohli-super-battingనాకౌట్ ను తలపించే విధంగా సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు పయనం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. పంజాబ్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ లో తొలుత వర్షం మైదానాన్ని ముంచెత్తడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న టెన్షన్ పడ్డ బెంగుళూరు జట్టు అభిమానుల కోసం వరుణుడు కరుణించాడు. దీంతో 15 ఓవర్ల మ్యాచ్ ప్రారంభమైన వేళ టాస్ గెలిచి బెంగుళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు పంజాబ్ జట్టు కెప్టెన్ మురళీ విజయ్. అక్కడ నుండి ప్రారంభమైన బెంగుళూరు బ్యాట్స్ మెన్ల దంచి కొట్టుడు చివరి బాల్ వరకు కొనసాగింది.

ఓపెనర్ క్రిస్ గేల్ 32 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో 73 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి, కేవలం 50 బంతుల్లో 8 సిక్సర్లు, 12 ఫోర్లతో ఏకంగా 113 పరుగులు చేసి, ఒక ఓవర్ ఉందనగా ఔటయ్యాడు. వీరిద్దరి బ్యాటింగ్ ప్రతిభతో 15 ఓవర్లలో ఏకంగా 211 పరుగులు చేసింది బెంగుళూరు జట్టు. ‘వరుణుడే’ చిన్నబోయే విధంగా విరాట్ కోహ్లి షాట్లు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భారీ స్కోర్ ను చూసి, లక్ష్య చేధనకు ముందే విజయం బెంగుళూరు అన్న విషయం ఖరారు కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే మరో ఓవర్ ఉందనగా వర్షం కురవడంతో అప్పటివరకు పంజాబ్ చేసిన 120 పరుగులను పరిగణనలోకి తీసుకుని, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 82 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. అప్పటికే 9 వికెట్లు కోల్పోయి లక్ష్య చేధనలో చేతులేత్తేసింది పంజాబ్ జట్టు. ఈ గెలుపుతో మెరుగైన రన్ రేట్ రీత్యా ఏకంగా రెండవ స్థానానికి చేరింది బెంగుళూరు జట్టు. మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ లో కూడా బెంగుళూరు రాణిస్తే, క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే పండుగ..!