యంగ్ హీరో రామ్ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది అంతులేని ఎనర్జీ. ఎప్పుడూ వెండితెరపై ‘హైపర్’ యాక్షన్ తో దూసుకువచ్చే రామ్, ఈ సారి తన సినిమా పేరునే ‘హైపర్’గా మార్చేసుకున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమాకు ‘హైపర్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేసారు.
ఆగష్టు 3వ తేదీన సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ‘కందిరీగ’ సక్సెస్ కాంభినేషన్ అయిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ – రామ్ ల జోడి మరోసారి ‘హైపర్’ ద్వారా అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’ అనేది ఈ ‘హైపర్’ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ వినగానే రామ్ కు ఎంత బాగా సూట్ అవుతుందో, ట్యాగ్ లైన్ కూడా ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతోంది. ఎందుకంటే… నిజంగానే ప్రతి ఇంట్లో ఒక ‘హైపర్’ వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు గనుక!
ఈ ఏడాది తొలి రోజున విడుదలైన ‘నేను… శైలజ…’ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్, ఈ ‘హైపర్’తో తన రేంజ్ పెంచుకుంటాడని ఆశిద్దాం. ‘1 నేనొక్కడినే, ఆగడు’ వంటి పెద్ద సినిమాలతో డీలాపడి, నానితో రూపొందించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’తో మళ్ళీ చక్కని విజయాన్ని చవిచూసిన 14 రీల్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణానికి భారీగానే ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ‘కందిరీగ’తో మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్, ‘రభస’తో ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయారు. మరి మూడవ సినిమాతో మరో మెమరబుల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.