obstacles for vijayawada metro railరాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ప్రాజెక్టులలో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటగా విజయవాడ మెట్రోను డిసెంబర్ 2018 లోపున పూర్తి చేయాలని ఏపీ సర్కార్ సంకల్పించుకుంది. ఈ ప్రాజెక్టు చేపట్టిన ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ అయితే ఆగష్టు లోపునే పూర్తి చేస్తామని అన్నారు. అయితే ఆ దిశగా కార్యాచరణ సాగుతోందా? అంటే ప్రభుత్వ పరంగా ముందడుగు వేస్తున్నా… మెట్రో కారిడార్లలో కొలువు తీరి ఉన్న ‘బిగ్ షాట్స్’ ఈ ప్రాజెక్టుకు మోకాలడ్డుతున్నారని సమాచారం.

బందరు రోడ్డు, ఏలూరు రోడ్లలోని సైట్ సర్వే కోసం వెళ్ళిన రెవిన్యూ, డీఎంఆర్సీ అధికారులకు వ్యాపార దిగ్గజాలు చుక్కలు చూపించారని తెలుస్తోంది. సర్వే నెంబర్ల ఆధారంగానే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వుండగా, సర్వేకు సహకరించకుండా, ‘ముఖ్యమంత్రితో ఈ విషయం పై చర్చించడానికి అప్పాయింట్మెంట్ తీసుకున్నమంటూ’ అధికారుల పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం.

మహాత్మా గాంధీ రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్ల వ్యాప్తంగా ప్రముఖ వ్యాపార సంస్థలు కొలువు తీరి ఉన్నాయి. వీరంతా సంయుక్తమై, మెట్రో ప్రాజెక్ట్ రాకుండా చూడాలన్న వార్తలు గతంలో హల్చల్ చేసాయి. దానికి తగిన విధంగానే ఒక ఎంపీ ద్వారా మెట్రో రూట్ ను మార్చేందుకు సర్వ ప్రయత్నాలు చేసారని, అవి విఫలం చెందటంతో మెట్రోకు ప్రత్యామ్నాయ మార్గాలను తెర పైకి తెచ్చారని, అయితే శ్రీధరన్ మాత్రం ముందుగా అనుకున్న మార్గానికే ఓటు వేయడంతో, ఇక చేసేది లేక ఇపుడు సైట్ సర్వేకు అడ్డు తగులుతున్నారనేది ప్రాధమికంగా లభ్యమవుతున్న వివరం. మరి దీనికి ముగింపు కార్డు ఎలా పడుతుందో? అసలు విజయవాడ మెట్రో సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.