టాలీవుడ్లో ఒక హీరో నటించిన సినిమాలను వేరే హీరోలు మెచ్చుకున్న సందర్బాలు చాలా అరుదు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఇతర సినిమాల గురించి స్పందించిన సమయాలు చాలా తక్కువ. అలాంటిది తాజాగా నాగార్జున ఒక యువ మెగా హీరో సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈయన తాజాగా ‘అఖిల్’ సక్సెస్ మీట్లో పాల్గొన్న సమయంలో ‘కంచె’ సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడాడు. ఆ సమయంలోనే మెగా హీరో వరుణ్ తేజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
సైనికుడి పాత్రలో వరుణ్ తేజ్ సూపర్‌గా నటించాడని, అతడి నటనకు ఫిదా అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. వరుణ్ నటన 1947 కాలాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉందని, దర్శకుడు క్రిష్ అప్పటి పరిస్థితులను రి క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అన్నారు. సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉందని, ముఖ్యంగా యుద్ద సన్నివేశాలు మెప్పించాయని పేర్కొన్నాడు. ఇప్పటికే పలువురు ‘కంచె’ను ప్రశంసించిన వారి జాబితాలో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో నాగార్జున కూడా చేరాడు. ఇక్కడ విశేషం ఏంటంటే తన కొడుకు నటించిన ‘అఖిల్’ చిత్రం సక్సెస్ మీట్లో నాగార్జున ‘కంచె’ చిత్రంపై ప్రశంసలు కురిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.