ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాట పట్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ వైపు పవిత్ర యజ్ఞం చేస్తుంటే… మరో వైపు ఆ పవిత్ర యజ్ఞాన్ని రాక్షసులు వచ్చి నాశనం చేసిన మాదిరి జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని నెల్లూరు నేత ఆనం వివేకానందరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఒక్క రోజు బంద్ వలన రాష్ట్రానికి 450 కోట్ల మేర ఆర్ధిక నష్టం వాటిల్లిందని, అసలే ఆర్ధిక లోటుతో ఉన్న ఏపీని మరింతగా కృంగదీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేసారు.
రాష్ట్రానికి జగన్ ఏదైనా సహాయం చేయాలని భావిస్తే… అది ఆర్ధిక పరిపుష్టికి దారితీసే విధంగా ఉండాలి గానీ, ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉండకూడదని ఆనం అభిప్రాయ పడ్డారు. తన పార్టీని బ్రతికించుకునేందుకు ఏపీని నాశనం చేస్తున్నాడని, తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇలా బంద్ లు చేస్తున్నాడని విమర్శల వర్షం కురిపించారు ఆనం. రాష్ట్ర పరిధిలో లేనటువంటి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో కాకుండా, కేంద్రంలో నిరసన తెలియజేయాలన్న కనీస అవగాహన లేని నేత ఏపీకి ప్రతిపక్షంగా ఉండడం, రాష్ట్ర దౌర్భాగ్యంగా అభివర్ణించారు.
ఉన్మాదిలా వ్యవహరిస్తున్న జగన్ వలన రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, పెళ్లికి చావు మంత్రం, చావుకు పెళ్లి మంత్రంలా జగన్ వ్యవహార శైలి ఉందని ఆనం తనదైన ట్రేడ్ మార్క్ బాణాలతో వైసీపీ వర్గాల గుండెల్లో గుచ్చారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించిన లక్ష కోట్ల రూపాయలను జగన్ తిరిగి ఇచ్చేస్తే గానీ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని, ఇప్పటికే ఈడీ 750 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిందని, ఇకనైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని సూచనలతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.