YCP-MPTC-Abhinav with Peddireddy Ramachandra Reddy‘దొరికితే దొంగలు..లేకుంటే దొరలు’ అనే మాట తరచూ వింటుంటాము. దానికి చిన్న ఉదాహరణగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి వైసీపీ ఎంపీటీసీ అభినవ్ గురించి చెప్పుకోవచ్చు.

ఇటీవల అతను తన స్నేహితులతో కలిసి కారులో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పట్టుబడ్డాడు. కాసేపటికి సోషల్ మీడియాలో అతను, ఏపీ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో దిగిన కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. మంత్రిగారికి సన్నిహితుడు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారనేది వాటి సారాంశం.

మంత్రిగా బాధ్యతలు చెప్పట్టిన వెంటనే ఆయన అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యి ఎర్రచందనం చెట్లు నరికివేత, దుంగల అక్రమ రవాణా ఎలా అరికట్టాలనే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అది జరిగిన కొన్ని రోజులకే వైసీపీ ఎంపీటీసీ అభినవ్ దుంగలతో పట్టుబడటంతో మంత్రిగారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా సోషల్ మీడియాలో తనతో అభినవ్ కలిసి దిగిన ఫోటోలు ప్రత్యక్షమవడంతో నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు.

వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ మీడియాతో మాట్లాడుతూ, “మాకు అభినవ్ చేస్తున్న ఇటువంటి పనుల గురించి తెలియగానే ఏప్రిల్ 23న పార్టీ నుంచి సస్పెండ్ చేశాము. కనుక అతనితో మా పార్టీకి ఎటువంటి సంబందమూ లేదు.

మంత్రిగారితో నిత్యం అనేక మంది ఫోటోలు దిగుతుంటారు. వారిలో అభినవ్ కూడా ఒకరు. అంతమాత్రన్న మంత్రిగారికీ అతని అక్రమ రవాణాతో ఏదో సంబందం ఉందన్నట్లు టిడిపి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదు. అభినవ్ టిడిపి నేత అమర్‌నాథ్ రెడ్డితో కూడా ఫోటో దిగాడు. కనుక ఆయనకు అభినవ్‌కు మద్య ఏమైనా ఉందేమో,” అని అన్నారు.

“ఏప్రిల్ 23వరకు అభినవ్ వైసీపీలో ఉన్నాడు. అతని అక్రమ కార్యక్రమాల గురించి మాకు తెలుసు,” అని ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ స్వయంగా చెప్పారు. కానీ అతను పట్టుబడ్డాడు కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నట్లు అర్దమవుతూనే ఉంది. ఒకవేళ అభినవ్ పట్టుబడకపోతే నేటికీ వైసీపీలోనే ఉండేవాడే కదా?