TV9-Ravi-Prakash-Re-Entryతెలుగువారికి ఓ అంతర్జాతీయ స్థాయిలో టీవీ9 న్యూస్ ఛానల్‌ను పరిచయం చేసిన వ్యక్తి టీవీ9 వ్యవస్థాపకుడు రవి ప్రకాష్‌. ఆయన వేసిన ఆ పునాదిపై నిలబడిన టీవీ9 న్యూస్ ఛానల్‌ ఇప్పుడు దేశంలో అన్ని ప్రధాన భాషలలో ప్రసారం అవుతోంది. కానీ ఆ పునాదుల కిందే రవి ప్రకాష్‌ నలిగిపోవడం విశేషం. అక్రమ ఆర్ధికలావాదేవీల ఆరోపణలలో ఈడీ కేసులలో చిక్కుకొని అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇవాళ్ళ ఆయన పుట్టినరోజు సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఆయనకు ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం.

నారా లోకేష్‌: జర్నలిజం- చీరింగ్ మద్య గల తేడా క్రమంగా అస్పష్టమవుతున్నప్పుడు, నైతిక విలువలు, నైతిక విధానాలకు కట్టుబడి పనిచేసిన రవి ప్రకాష్ వంటి జర్నలిస్టులు నాల్గవ స్తంభమైన మీడియాతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు గుర్తుకువస్తున్నాయి. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ సత్యాన్వేషణలో ముందుకు సాగాలని కోరుకొంటున్నాను,” అని ట్వీట్ చేశారు.

రవి ప్రకాష్ మళ్ళీ మరో న్యూస్ ఛానల్‌తో రాబోతుడున్నారని కొంతకాలం క్రితం ఊహాగానాలు వినిపించాయి. కానీ అటువంటిదేమీ జరుగలేదు. మరొక ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నందున, రవి ప్రకాష్ కొత్త న్యూస్ ఛానల్‌ స్థాపించడం లేదా అర్నాబ్ గోస్వామి నిర్వహిస్తున్న రిపబ్లిక్ టీవీని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందరూ మరిచిపోయిన రవి ప్రకాష్‌కు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఇద్దరూ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చూస్తే త్వరలో ఆయన తిరిగి రాబోతున్నట్లే భావించవచ్చు.