2022-23 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అందించిన బడ్జెట్ పై ఓ ముఖ్యమంత్రిగా జగన్ నోరు విప్పలేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నిన్నే ఓ ప్రెస్ మీట్ నిర్వహించి “మోడీ అండ్ కో”ను ఎవ్వరూ విమర్శించలేని స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. గతంలో చంద్రబాబు కూడా మోడీని ఈ స్థాయిలో విమర్శించలేదు.
అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అభిప్రాయం. కేసీఆర్ మాదిరే అందరూ నెగటివ్ గా మాట్లాడాలని లేదు, అలాగే పాజిటివ్ గా మాట్లాడాలని కూడా లేదు. ఇదే బడ్జెట్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. నదుల అనుసంధానాన్ని ఆహ్వానించారు, అలాగే రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై పెదవి విరిచారు. ఓ రాజకీయ నేతగా చంద్రబాబు అభిప్రాయం అది.
కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. వైసీపీ పార్టీకి చెందిన ఇతర నేతలు మాట్లాడారు గానీ, రాష్ట్ర పెద్దగా సీఎం స్థానంలో ఉన్న జగన్, ఈ అంశంపై తన అభిప్రాయం వ్యక్తపరచాల్సిన బాధ్యత ఉంది. మాట్లాడలేని స్థితిలో ఉంటే కనీసం ప్రెస్ నోట్ ద్వారా అయినా భావాలు తెలియపరుస్తుంటారు. కానీ ఏపీ సీఎం మాత్రం మౌనం వహిస్తూనే ఉన్నారు.
దీంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం జగన్ వద్ద లేదని, ఒకవేళ అలా అడిగితే మళ్ళీ తనపై కేసులు ఏమవుతాయో అన్న భయం జగన్ లో నెలకొందని, అందుకే సీఎంగా ఉండి కూడా జగన్ మోహన్ రెడ్డి స్పందించలేదని ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి.
ఈ మౌనం కేవలం జగన్ లోని నిస్సహాయతను సూచిస్తోంది తప్ప ఇంకేం కాదన్న భావన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ బడ్జెట్ ద్వారా 23 వేల కోట్లు వస్తాయని జగన్ ఆశించినప్పటికీ, ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, ఇప్పటివరకు కేంద్రం అత్యధికంగా ఏపీకే కేటాయించిందని, అది కూడా జగన్ మోహన్ రెడ్డి వలనేనని చెప్పడంతో, ఏ ‘టర్న్’ తీసుకోలేని స్థితిలో జగన్ ఉండిపోయారన్న విశ్లేషణలు వస్తున్నాయి.