Kathilantodu-Chiranjeeviచిరంజీవి 150వ చిత్రం ‘కత్తి’ కథ తనదేనని, తనకు న్యాయం చేయాలని కోరిన రచయిత ఎన్ నరసింహరావుతో ‘కత్తి’ నిర్మాతల సంప్రదింపులు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. 40 లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వడంతో పాటు, టైటిల్స్ లో తన పేరు వేసేందుకు నిర్మాతలు హామీ ఇవ్వడంతో ఈ వివాదం ముగిసినట్టేనని నరసింహరావు ప్రకటించారు.

అంతకుముందు సినిమా కథ తనదేనని, దాన్ని తెలుగు రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయించానని ఆధారాలు చూపగా, దర్శకరత్న దాసరి నారాయణరావు తదితరులు ఈ ఆధారాలు నిజమేనని, న్యాయం జరిగేంత వరకూ కత్తి షూటింగ్ కు వెళ్లవద్దని సినీ కార్మికులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న తరుణంలో ఇబ్బందులను దూరం చేసుకునేందుకు నరసింహరావుతో సంప్రదింపులు జరిపిన ‘మెగా’ టీం, సమస్యను ఓ కొలిక్కి తేవడంలో విజయం సాధించింది. దీంతో ‘కత్తి’ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.