ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 నుంచి 8 గంటలు ప్రశ్నించారు. రాత్రి 7.30 గంటలకు ఇంకా కవితను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈరోజు ఆమెని అరెస్ట్ చేయవచ్చని అనుమానంతో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలాదిమంది బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఢిల్లీ చేరుకొని అక్కడే ఆమె కోసం ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో కూడా బిఆర్ఎస్ శ్రేణుల హడావుడితో ఓ రకమైన యుద్ధవాతావరణం సృష్టించారని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీని ఈడీ, సీబీఐ, ఐటి తదితర పది తలలు కలిగిన రావణాసురుడిగా చూపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలు బిజెపిలో చేరి కేసుల నుంచి విముక్తి అయ్యారని, కానీ కల్వకుంట్ల కవిత మాత్రం ఒత్తిళ్ళకు తలొగ్గకుండా పోరాడుతున్నారంటూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి.
కల్వకుంట్ల కవితని ఉద్దేశ్యించి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశాదంటూ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ, పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేస్తున్నారు.
హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి నేతృత్వంలో బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఊరేగింపుగా బయలుదేరి రాజ్‌భవన్‌కు చేరుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొన్నారు. దీంతో వారు రాజ్‌భవన్ గోడకి తమ వినతిపత్రాన్ని అంటించి అక్కడే కూర్చొని ధర్నా చేసారు.
అక్కడ ఢిల్లీలో వందలాదిమంది బిఆర్ఎస్ శ్రేణులను మోహరించి, మరోపక్క రాష్ట్రంలో చేస్తున్న ఈ హడావుడి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. ఒకవేళ కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని బిఆర్ఎస్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. కనుక కేంద్రం ఈ ఒత్తిళ్ళకు తలొగ్గి కవితను విడిచిపెట్టమని ఈడీకి సూచిస్తుందా లేక కవితను అరెస్ట్ చేసి కేసీఆర్‌ని ఢీకొంటుందా? అనే ప్రశ్నకు మరికొద్ది సేపటిలో సమాధానం లభించవచ్చు.