గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్ బాబు ఆ తదుపరి వైసీపీ తరపున తీవ్ర ప్రచారం చేయడం తదితర సంగతులు తెలిసినవే. అలాగే ఇటీవల ముగిసిన ‘మా’ ఎన్నికలు ముగిసిన తదుపరి కూడా ఏపీ సీఎంను మోహన్ బాబు కలిసి వెళ్లిన విషయం విదితమే.
అంతలా వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా ఏపీ సీఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న మోహన్ బాబుకే తాజాగా జగన్ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదన్న వార్త ప్రాధాన్యతను దక్కించుకుంది. ఇటీవల మోహన్ బాబు విజయవాడ విచ్చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్టిల్స్ కూడా నెట్టింట సందడి చేసాయి.
Also Read – చంద్రబాబు నాయుడు… రేవంత్ రెడ్డి… ఎవరు బెటర్?
బంధువుల కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేసానని చెప్పిన మోహన్ బాబు, తన ఆప్తులను కూడా కలుస్తానంటూ పరోక్షంగా జగన్ తో ఉండబోయే భేటీపై హింట్ ఇచ్చారు. కానీ వీరిద్దరూ భేటీ కాకపోవడంతో, మోహన్ బాబుకు జగన్ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదన్న ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇటీవల ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో జగన్ పాలనపై నర్మగర్భంగా మోహన్ బాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఫీజు బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని, ఏవో కొద్దిగా మాత్రమే విడుదల అయ్యాయని, అలాగే కాలేజీ ఫీజుల నిర్ణయం చాలా తప్పిదంగా ఓపెన్ గానే చెప్పారు మోహన్ బాబు.
Also Read – జోగి అండ్ సన్స్: ఒకరు సుప్రీంకోర్టులో మరొకరు హైకోర్టులో!
బహుశా ఈ వ్యాఖ్యల ప్రభావమో లేక టాలీవుడ్ టికెట్ ధరలపై చర్చించేందుకు సుముఖత లేకపోవడమో… కారణాలు ఏవైనా నాడు వైసీపీ గెలుపులో కృషి చేసిన మోహన్ బాబుకు సమయాన్ని కేటాయించకపోవడాన్ని తెలుగు తమ్ముళ్లు అవకాశంగా తీసుకున్నారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టే మోహన్ బాబు కూడా జగన్ విషయంలో ఆచితూచి స్పందిస్తున్న వైనం గమనించదగ్గదే!