YS_Sharmila_YSR_Telangana_presidentవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె గురువారం ఖమ్మంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ఒకప్పుడు పువ్వాడ రౌడీ షీటర్ అని, ఆయన కుటుంబం సిపిఐలో ఉన్నప్పుడు చిన్న ఇంట్లో నివసించేదని అటువంటి పువ్వాడ టిఆర్ఎస్‌లో చేరి కోటీశ్వరుడు అయిపోయారని, ఇది ఎలా సాధ్యమని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో జరిగే ప్రతీ అభివృద్ధి పనులలోనూ పువ్వాడ అవినీతికి పాల్పడుతూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పువ్వాడ అజయ్ కుమార్‌కి ఇప్పుడు శామీర్‌పేటలో వందల కోట్లు విలువచేసే 80 ఎకరాలు ఉన్నాయని, ఆయన అవినీతికి ఇదే ఓ నిదర్శనమని వైఎస్ షర్మిల ఆరోపించారు.

సిఎం కేసీఆర్‌ టీఎస్‌ఆర్టీసీని అప్పజెప్పితే పువ్వాడ దానిని ముంచేసి తాను మాత్రం కోట్లు సంపాదించుకొన్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మంత్రిగా ఉన్నాను కదా అనే అహంకారంతో విర్రవీగుతున్న పువ్వాడకు ప్రజలే తగినవిదంగా బుద్ధి చెప్పాలన్నారు వైఎస్ షర్మిల.

వైఎస్ షర్మిల తెలంగాణ సిఎం కేసీఆర్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో పేద ప్రజలు డబ్బులేక ఆకలితో అలమటిస్తుంటే, టిఆర్ఎస్‌ పార్టీ బ్యాంక్ ఖాతాలో రూ.860 కోట్లు మూలుగుతున్నాయని ఆ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వచ్చిందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సిఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తాను, తన కుటుంబం, పార్టీ, నేతలు మాత్రం కోట్లకు పడగలెత్తారని వైఎస్ షర్మిల ఆరోపించారు. సిఎం కేసీఆర్‌ ప్రజలకు మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు.

ఆమె చేసిన విమర్శలు, ఆరోపణలపై మంత్రి పువ్వాడ కూడా చాలా ఘాటుగా బదులిచ్చారు. “మీ అన్నతో పంచాయతీ ఉంటే వెళ్ళి మీ అన్నదగ్గర తేల్చుకోవాలి కానీ ఇక్కడ పాదయాత్ర చేస్తూ ప్రశాంతంగా ఉన్న ప్రజల మద్య ఎందుకు చిచ్చుపెడుతున్నారు?గనులు, భూముల కబ్జాలు, క్విడ్ ప్రో దందాలతో అక్రమాస్తులు పోగేసుకొన్న గొప్ప చరిత్ర మీ కుటుంబానిదే. దమ్ముంటే మీ తండ్రి హయాంలో జరిగిన అరాచకాల గురించి, మీ అన్న హయాంలో జరుగుతున్న విధ్వంసక పాలన గురించి మాట్లాడితే బాగుంటుంది. మంత్రి పదవి కోసం నేనేమీ మీ అన్న జగన్మోహన్ రెడ్డిలా పాకులాడలేదు. ఎవరికీ డబ్బు మూటలు పంచలేదు. టిఆర్ఎస్‌ పార్టీలో నేతలు, కార్యకర్తల పనితీరు, సమర్దతను చూసే సిఎం కేసీఆర్‌ పదవులు ఇస్తారు. మంత్రిగా నేను ఖమ్మం జిల్లాను ఎంత అభివృద్ధి చేశానో చెప్పగలను. మీరు కూడా తెలంగాణకు చెందినవారే అంటున్నారు కదా?దమ్ముంటే వచ్చే ఎన్నికలలో ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలవగలరా?” అంటూ మంత్రి పువ్వాడ వైఎస్ షర్మిలకు సవాల్ విసిరారు.