YSRCP Ministers ribbon cutting for isolation wardsవిపత్తు సమయమైన లేక విద్వాసమైన రాజకీయ నాయకులు తమ తమ రాజకీయ ప్రయోజనాలను ఏ మాత్రం వదులుకోరు. ఇటువంటి సమయంలో కూడా తమకు మాక్సిమం పబ్లిసిటీ వచ్చేలా వారి జాగ్రత్తలు వారు పడతారు. ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విపత్తు సమయంలో కూడా పడుతున్న పబ్లిసిటీ పాట్లు అన్నీ ఇన్నీ కావు.

విశాఖ‌ప‌ట్నంలో కరోనా చికిత్స కేంద్రం ఓపెన్ చేస్తూ మంత్రి అవంతి శ్రీ‌నివాస్, చిల‌క‌లూరిపేట‌లో ఐసోలేష‌న్ వార్డు ఓపెన్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ర‌జినీ రిబ్బ‌న్ క‌ట్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. చివరికి ఐసొలేషన్ వార్డులలో కూడా మీ పబ్లిసిటీ కక్కుర్తి ఏంటి అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… చాలా చోట్ల పేదలకు ఇచ్చే రేషన్లు, 1000 రూపాయిల ప్రభుత్వ సహాయంతో గ్రామా వాలంటీర్లతో పాటు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు… స్థానిక ఎన్నికలలో పోటీ చేసిన నేతలు వెళ్ళిపోయి మాకే ఓటు వెయ్యండి అంటూ వేడుకుంటున్నారట. పలమనేరులో ఒక్క చిన్న బ్రిడ్జ్ ఓపెనింగ్ కు అనుచరగణం తో వెళ్లి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేష్ హల్ చల్ చేశాడట.

సామజిక దూరం పాటించడం మరచిపోయి అనుచరులతో జై జైలు కొట్టించుకున్నారట. అదేమని అడిగితే యెల్లో మీడియా అంటూ విరుచుకుపడ్డారు. పలమనేరులో ఇప్పటికే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అది అలా ఉంచితే ఆ బ్రిడ్జికు ప్రభుత్వానికి ఏ సంబంధం లేదట. ఎవరో దాత డబ్బులు ఇస్తే దానికి సదరు ఎమ్మెల్యే సోకులు అంటూ స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. పబ్లిసిటీ మాట తరువాత ఇటువంటి చేష్టలతో మరింత అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు అధికార పార్టీ నేతలు.