Nara_Lokeshఈ నెల 27నుంచి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. దాని కోసం టిడిపి నేతలు 10 రోజుల క్రితమే చిత్తూరు జిల్లా పోలీసులని అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకొన్నారు కూడా. కానీ పాదయాత్ర షెడ్యూల్ మాత్రమే పంపించారని, అనుమతి కోరలేదని పోలీసులు చెపుతున్నారు. ఒకవేళ దరఖాస్తు చేసుకొంటే పరిశీలిస్తామని చెపుతున్నారు.

నారా లోకేష్‌ పాదయాత్రకి ఇంతవరకు పోలీసులు అనుమతించలేదని గుర్తు చేస్తూ టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామాయ్య శనివారం డిజిపికి లేఖ వ్రాశారు. పాదయాత్ర తేదీ దగ్గర పడుతున్నందున తక్షణం అనుమతి మంజూరు చేయాలని ఆ లేఖలో కోరారు.

నారా లోకేష్‌ పాదయాత్ర అడ్డుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా జీవో నంబర్:1 తీసుకువచ్చిందని, అందుకే దానిపై హైకోర్టు విచారణ జరుపుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉండవచ్చని టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నారా లోకేష్‌ పాదయాత్రని అడ్డుకోవలసిన ఖర్మ తమ ప్రభుత్వానికి లేదని, ఆయన ఎన్ని వేలకిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాబోయే ఎన్నికలలో గెలిచేది మా పార్టీయే అని మంత్రి రోజా వంటివారు చెపుతున్నారు. నారా లోకేష్‌ పాదయాత్రకి వైసీపీ ప్రభుత్వానికి అభ్యంతరంలేనప్పుడు, దరఖాస్తు చేసుకొన్నా పోలీసులు ఇంతవరకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలతోనే వైసీపీ నేతల్లో గుబులు మొదలైందని ఇప్పుడు నారా లోకేష్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తే తమ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఈ నెల 23న జీవో నంబర్:1పై హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. ఒకవేళ హైకోర్టు ఆ జీవోని కొట్టివేస్తే నారా లోకేష్‌ పాదయాత్రని అడ్డుకోవడం అసంభవం. ఒకవేళ పోలీసులతో ప్రభుత్వం అడ్డుకొనే ప్రయత్నం చేస్తే తాము హైకోర్టుని ఆశ్రయించి అనుమతి తెచ్చుకొంటాము తప్ప ఎట్టి పరిస్థితులలో నారా లోకేష్‌ పాదయాత్ర ఆపబోరని టిడిపి నేతలు చెపుతున్నారు. చివరికి జరిగేది కూడా ఇదే!