KCR TRS‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అంటే ఇలాటే ఉంటుందేమో. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విలవిలలాడుతున్న వైసీపీకి… తెలంగాణలో ‘గులాబీ’ దండు పెద్ద షాకే ఇవ్వనుంది. ఏపీలో పార్టీ ఎమ్మెల్యేలు వరుస కట్టి టీడీపీలోకి చేరుతుండగా, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఆ పార్టీ శాఖ ఏకంగా విలీనం కానుంది. దీనికి సంబంధించి పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో దాదాపుగా తుడిచి పెట్టుకుపోయిందనుకున్న వైసీపీకి… ఖమ్మం జిల్లా ఫలితాలు కొత్త ఊపిరిని పోసాయి. తెలంగాణలో ఖమ్మం మినహా ఏ ఒక్క జిల్లాలో ఆ పార్టీ ఊసు కనిపించకపోయినా… ఖమ్మం లోక్ సభతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి పరువు నిలుపుకుంది. అయితే టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ కు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ‘గులాబీ’ కండువాలు కప్పుకోగా, ఎంపీగా సత్తా చాటిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. మరో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (పినపాక) ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

అయితే పొంగులేటి సహా పాయం కూడా టీఆర్ఎస్ లో చేరిపోతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. ఈ మేరకు టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో పొంగులేటి కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పొంగులేటితో పాటు పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్ లో చేరే క్రమంలో జరిగిన ఈ చర్చలు దాదాపుగా టీఆర్ఎస్ కు సానుకూల ఫలితాలను ఇచ్చాయని టాక్. తమ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాత ఇద్దరూ కలిసి టీఆర్ఎస్ లో చేరికపై ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం, మిగిలిన మరో ఎమ్మెల్యే, సింగిల్ ఎంపీ కూడా కారెక్కనున్న నేపథ్యంలో తమ పార్టీ శాఖను టీఆర్ఎస్ లో విలీనం చేయనున్నట్లు కూడా ఆ పార్టీ రాష్ట్ర శాఖ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే తెలంగాణాలో జగన్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతైనట్లే.