world worst cricket recordకొన్ని అసాధ్యమైన రికార్డులు ఈ ఏడాది సాధ్యమవుతున్నాయి. ఇటీవల ఇండియాలో ఒక ముంబై బ్యాట్స్ మెన్ ఏకంగా 1000కి పైగా పరుగులు చేసి అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం కలలో మాత్రమే ఊహించుకోవడానికి సాధ్యమయ్యే ఇలాంటి రికార్డే మరొకటి నమోదై ప్రపంచ క్రికెట్ ను నివ్వెరపరిచింది.

చిన్న పిల్లలు ఆడుతున్న జట్టుకు కూడా సాధ్యం కాని రికార్డు ఒకటి ఇంగ్లాండ్ లో జరిగిన ఓ మ్యాచ్ లో నమోదైంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన ఓ ప్రాంతీయ టోర్నీలో బాష్ ఛైల్డ్ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. కెంట్ ప్రాంతంలోని కంటెర్ బరీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన క్రైస్ట్ చర్చ్ యూనివర్సీటీ జట్టు 120 పరుగులు చేసింది.

121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బాష్ చైల్డ్ జట్టు కేవలం 20 బంతులను ఎదుర్కొని 10 వికెట్లు కోల్పోయి, కనీసం ఒక్క పరుగు కూడా నమోదు చేయలేకపోయింది. అంతేకాదు, ఈ మొత్తం 20 బంతులలో కేవలం ఒకే ఒక బంతి బ్యాట్ ను తాకింది. ఒక్క పరుగు కూడా చేయకుండా ఆలౌట్ అయిన ఘనతను ఆ టీం సొంతం చేసుకుంది. ఏ స్థాయి క్రికెట్ లో అయినా ఇదే అత్యంత చెత్త రికార్డు. బహుశా ఇలాంటి రికార్డు మళ్ళీ మళ్ళీ నమోదయ్యే అవకాశం కూడా ఉండదని క్రికెట్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.